Mothe Srilatha Shoban Reddy joins in Telangana Congress Party: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోతే శ్రీలత రెడ్డితో పాటు, కార్మిక సంఘం నాయకులు శోభన్ రెడ్డి దంపతులు గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కోసం 24 సంవత్సరాలు కష్టపడ్డ వారిని కాకుండా పార్టీకి సంబంధం వ్యక్తులను పదవులు కట్టబెట్టడం సరికాదని వారు మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ పేరుతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు.
డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2000 సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులుగా మాకు సరైన న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందం కలిగింది. ఎవరి ఒత్తిడి లేకుండానే ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను’’ అని శ్రీలత రెడ్డి అన్నారు.
మాతోనే మొదలై మాతోనే ముగుస్తుంది
మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడం రాజీనామా చేయడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్నటువంటి వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మా కుటుంబంలో మా తమ్ముడుతో మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పటికీ ఉద్యమకారులను గుర్తించకపోవడం పట్ల కాంగ్రెస్ వైపు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉద్యమకారులకు గౌరవం దక్కుతుందనే ఉద్దేశంతో పార్టీలో చేరాం. గ్రేటర్ హైదరాబాద్ లో మా తోనే టీఆర్ఎస్ పార్టీ మొదలైంది మాతోనే బీఆర్ఎస్ పార్టీ ముగుస్తుంది’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఫ్లోర్ లీటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ గారు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.