జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మలిక్ తొలి రోజు కస్టడీ ముగిసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న అతణ్ని పోలీసులు గురువారం (జూన్ 9) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పీఎస్ కు తీసుకెళ్లారు. వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌ సాదుద్దీన్‌ మలిక్‌ను సుమారు 6 గంటలకుపైగా విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే, పోలీసుల ప్రశ్నలకు అతడు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఇతర మైనర్లతో అతనికి ఏం సంబంధం అనే అంశంపైన కూడా సాదుద్దీన్‌ ప్రశ్నించగా, అతను సరైన సమాధానం ఇవ్వలేదని పోలీసులు వర్గాలు తెలిపాయి.


కీలక పాత్ర ఇతనిదే...
ఇప్పటికే ఈ కేసులో ఏ - 1గా సాదుద్దీన్ ఉన్న సంగతి తెలిసిందే. అసలు ఈ అత్యాచారానికి కీలక సూత్రధారి కార్పొరేటర్‌ కొడుకే అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. ఘటన జరిగిన రోజు కార్పొరేటర్‌ కొడుకు బాధిత బాలికను మాటల్లో పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటూ నమ్మించి తీసుకెళ్లాడు. బంజారాహిల్స్‌లోని బేకరీకి వెళ్లాక బాలిక బ్యాగు, గాగుల్స్, సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. తన కారులో వస్తేనే అవి తిరిగి ఇస్తానని వేధించాడు. అలా ఇన్నోవా వాహనం ఎక్కించారు. అలా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.


మైనర్ల విచారణకు జువైనల్ కోర్టు అనుమతి  
నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురికి 5 రోజుల పాటు జువెనైల్‌ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి నుంచి 5 రోజులు వీరిని విచారణ జరుపుతారు. మిగిలిన ఇద్దరు మైనర్లను కస్టడీకి ఇచ్చేందుకు నేడు కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. వీరిని జువెనైల్‌ హోంలో అడ్వకేట్ ఎదుట యూనిఫాం లేకుండా సాధారణ బట్టలు వేసుకొని పోలీసులు విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. నేరాన్ని రుజువు చేయడంలో కీలకమైన లైంగిక పటుత్వ పరీక్షను కూడా పోలీసులు చేయించనున్నారు.


మైనర్లను మేజర్లుగా పరిగణిస్తారా?
కేసు విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత జరిగే విచారణ సమయంలో నిందితులుగా మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరారు. తీవ్ర నేరాలకు పాల్పడిన సందర్భాల్లో చట్ట ప్రకారం మైనర్లను మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన సవరణను బోర్డుకు తెలపనున్నారు.