జూబ్లీహిల్స్ మైనర్ బాలిక (Jubilee hills Minor Girl Rape) గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో ఐదుగురు మైనర్లు అన్న విషయం తెలిసిందే. ఆ నిందితులుగా ఉన్న వారిని కేసు విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత జరిగే విచారణ సమయంలో నిందితులుగా మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ఒక్కడే 18 ఏళ్లు నిండిన వ్యక్తిగా ఉన్నాడు.
ఇతణ్ని రిమాండ్ కోసం చంచల్ గూడ జైలుకు పంపారు. ఆ తర్వాత పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరగా.. నాంపల్లి కోర్టు 3 రోజుల కస్టడీని మంజూరు చేసింది. అందులో భాగంగా నేడు చంచల్ గూడ జైలు నుంచి సాదుద్దీన్ ఖాన్ ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసు విచారణలో సాదుద్దీన్ నుంచి సేకరించనున్న సమాచారం కీలకం కానుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా చేయనున్నారు. ఇందులో భాగంగా ఆమ్నేషియా పబ్, కాన్ సీ యూ బేకరీ, అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్లనున్నారు. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులు ఇన్నోవా కారును దాచి పెట్టిన ఫాంహౌజ్ ప్రాంతానికి కూడా సాదుద్దీన్ ను తీసుకెళ్లనున్నారు.
చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించే అవకాశం
మరోవైపు, మైనర్లు అయిన నిందితులను జువైనల్ హోంలో ఉంచారు. వీరి కస్టడీ కోసం పోలీసులు జువైనల్ కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. తీవ్ర నేరాలకు పాల్పడిన సందర్భాల్లో చట్ట ప్రకారం మైనర్లను మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన సవరణను బోర్డుకు తెలపనున్నారు.
నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లకు ప్రభుత్వ వైద్యులతో వైద్య పరీక్షలు కూడా చేస్తారు. వారికి లైంగిక పటుత్వ పరీక్ష కూడా ఇందులో భాగంగా ఉంటుంది. చార్జిషీట్ దాఖలకు ఈ పరీక్ష కీలకం కావడంతో కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం.