తెలంగాణ గవర్నర్‌ తమిళిసైపై (Tamilisai) తీరుపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖను దాటుతున్నారని వ్యాఖ్యానించారు. రేపు రాజ్ భవన్ లో మహిళల దర్బార్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు బీజేపీ తెలంగాణపై రాజకీయ దాడి పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి అజ్యం పోస్తున్నట్లుగా ఉందని అన్నారు. 


ఈ నెల 10న ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తమిళిసై రాజ్‌ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని గవర్నర్‌ కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే గవర్నర్ నిర్ణయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎవరైనా ప్రతినిధులు వస్తే గవర్నర్ ని కలవచ్చు, వారు ఇచ్చే వినతి పత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపొచ్చు. అంతేగాని ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్‌ను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. గవర్నర్ కు రాజకీయ నేపథ్యం ఉన్న సంగతి తెలుసని అన్నారు.


ప్రభుత్వమే సీపీతో అలా చెప్పించింది - నారాయణ
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడుతూ.. మైనర్లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని అన్నారు. పబ్‌ను సీజ్‌ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అబద్ధాలు చెప్పారని నారాయణ విమర్శించారు. ప్రభుత్వమే ఆయనతో అలా చెప్పించిందని ఆరోపించారు. సీవీ ఆనంద్ మంచి వ్యక్తి అని, కానీ ఆయన కూడా ఒత్తిళ్లకు లొంగి మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. టీఆర్​ఎస్ తన మిత్రపక్షమైన ఎంఐఎం, ఇతర పార్టీల నేతల పిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 


మైనర్లను అనుమతించిన పబ్ ను మూసేసి, దాని యజమానిని అరెస్ట్ చేయాలని కోరారు. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పబ్​లపై  పోలీసుల, రాష్ట్ర ప్రభుత్వ నిఘా లోపించిందని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. నగరం డ్రగ్స్ మాఫియాకు అడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.