Ganesh Nimajjanam 2023 in Hyderabad:


ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కెమికల్స్ వాడి తయారుచేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో, నగరంలోని చెరువలలో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. గణేష్ నిమజ్జనం హైకోర్టు ఉత్తర్వులకు నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకులు ఆందోళనకు దిగారు. దాంతో సోమవారం రాత్రి ట్యాంక్ బండ్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గణేష్ మండప నిర్వాహకులు కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ మతాలపై లేని ఆంక్షలు కేవలం హిందు పండుగలపై మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గత సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై ఇబ్బందులు పెడుతుందన్నారు. కోర్టులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వాహకులు చెబుతున్నారు.


ప్రతి ఏడాది వినాయక నిమజ్జనంపై వివాదం చెలరేగుతోంది. మట్టి విగ్రహాలు వినియోగించాలని, తద్వారా పర్యావరణానికి ఏ హాని ఉండదని అధికారులు, ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర కెమికల్స్ వాడి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పాటు నగరంలోని చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలలోకి వస్తాయని, వీటిని అమలు చేయాలని హైదరాబాద్ సీపీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ లను హైకోర్టు ఆదేశించింది.


గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు
గణపయ్యలను సాగనంపే సమయం దగ్గర పడుతుండటంతో గణేష్ నిమజ్జనానికి ఏ ఇబ్బందులు లేకుండా జంట నగరాలలో జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 22 ప్రాంతాల్లో భారీ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 27 ప్రదేశాల్లో బేబీ పాండ్స్, 23 ప్రాంతాల్లో కొలనులు ఏర్పాటు చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను మాత్రం హుస్సేన్ సాగర్ లో గానీ, నగరంలోని చెరువులలో గానీ నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఆదేశించింది. పర్యావరణాన్ని కాపాడేందుకు, నగరంలోని నీళ్లు మరింత కలుషితం అవకూడదని భావించి హైకోర్టు ఈ చర్యలు చేపట్టింది.