Minister KTR: హైదరాబాద్ నగరంలోని ముసారాంబాగ్ వద్ద కొత్త వంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 152 కోట్ల అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో పాటు మూసీ, ఈసీ ఉప నదులపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. 2020లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందులు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కరోనా కారణంగా కొన్ని పనులను చేయలేకపోయామని, ఇప్పుడు అన్నింటినీ పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలన్న సంకల్పంతో ఎస్టీపీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన కంటే మరింత అందమైన వంతెనలను నిర్మించనున్నట్లు చెప్పారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామన్నారు. 9 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్ర రాజధాని నగరంలో 30 వేల డబుల్ బెడ్ రూము ఇళ్లను అర్హులైన పేదలకు అందించామని తెలిపారు. త్వరలోనే మరో 40 వేల డబుల్ బెడ్రూము ఇళ్లను పేదలకు అందజేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.






ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్


రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని.. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లో రెండో విడత డబుల్ బెడ్రూము ఇళ్లను సెప్టెంబర్ 21వ తేదీన మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్ లో కట్టిన లక్ష రెండు పడక గదుల ఇళ్లలో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తి అయిందని తెలిపారు. మిగిలిన 70 వేల డబుల్ బెడ్రూము ఇళ్లను కూడా అత్యంత పారదర్శకంగా రాబోయే నెల, నెలన్నర కాలంలో అర్హులైన వారికి అందజేస్తామని వెల్లడించారు.


కాంగ్రెస్, బీజేపీ నాయకులకూ ఇళ్ల పంపిణీ: కేటీఆర్


దుండిగల్ లోని 4 వేల ఇళ్లు కట్టేందుకు ఒక్కో ఇంటికి రూ.10 లక్షల చొప్పున ఖర్చు అయినట్లు కేటీఆర్ వెల్లడించారు. లక్ష ఇళ్లు హైదరాబాద్ లో నిర్మిస్తే రూ.9,718 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు తెలిపారు. ఒక్కో డబుల్ బెడ్రూము ఇల్లు కట్టేందుకు ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ. 10 లక్షలుగా పేర్కొన్నారు. కానీ లక్ష ఇళ్ల మొత్తానికి మార్కెట్ విలువ రూ. 50 వేల నుంచి రూ. 60 వేల కోట్ల వరకు ఉందని తెలిపారు. ఆ ఆస్తులను కేసీఆర్ సర్కారు పేదల చేతిలో పెడుతున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూము ఇళ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. ఎంత పాదర్శకంగా రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ జరుగుతుందో చెప్పడానికి కేటీఆర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. జగద్గిరిగుట్ట డివిజన్ 126వవ డివిజన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కౌసల్యకు మొదటి విడతలో డబుల్ బెడ్రూము ఇల్లు వచ్చిందని.. అదే డివిజన్ లోని బీజేపీ నాయకురాలు సునీతకు కూడా తొలి విడతలోనే ఇల్లు వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.