Gaddar Death News : ప్రజా గాయకుడు గద్దర్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి తెలంగాణకు, పీడిత, తాడిత ప్రజలకు తీరని లోటు అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షలు మల్లు రవి.. గద్దర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. 


గద్దర్ తెలంగాణ పోరాట యోధుడు.. తెలంగాణ సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఉతేజపరిచారు అని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం పట్ల అపార అభిమానం ఉన్న వ్యక్తి గద్దర్. ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీతో గద్దర్ ఎంతో ఆప్యాయంగా ఉన్నారని, ఆయన మరణాన్ని తట్టుకోలేక పోతున్నాం అన్నారు రేవంత్ రెడ్డి. గద్దర్ మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో ముఖ్య కూడళ్లలో గద్దర్ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






రాహుల్ గాంధీ సంతాపం.. 
తెలంగాణలో దిగ్గజం, ఉద్యమకారుడు గుమ్మడి విట్టల్‌రావు మరణం తనను చాలా బాధించిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగకుండా పోరాడేలా చేసిందన్నారు. ఆయన నుంచి స్ఫూర్తి పొంది మనం ముందుకు సాగాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.






 


ప్రజా సమస్యలపై ఆయన పోరాటం గద్దర్ అజరామరం 
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉద్యమ గళం మూగబోయిందని, ప్రజా యుద్ధనౌక గద్దర్  కన్నుమూశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. తన పోరాటానికి స్ఫూర్తి గద్దర్ అని, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరం అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 


జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు. తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారు గద్దర్ అని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారని, తన పాటలతో, తన గళంతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చిన గొప్ప ఉద్యమ శక్తి గద్దర్. తెలంగాణ ఉద్యమ గళం అయిన గద్దర్ స్మృతిలో.. ఆయనకు నివాళులు అర్పించారు.






పొడుస్తున్న పొద్దు అస్తమించింది - ఎమ్మెల్యే సీతక్క
పొడుస్తున్న పొద్దు అస్తమించింది అని గద్దర్ మరణంపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఆయన పాట తూపాకీ తూటాలా ఉండేది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది ఆయన ఆట, పాట అని కొనియాడారు. దశాబ్దాల కాలం నుంచి ఆయన జీవితాన్ని పీడిత వర్గాల కోసం, వారిని చైతన్యం చేయడం కోసం కాలికి గజ్జె కట్టి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు. ఇటీవల జరిగిన ఖమ్మం సభలో గద్దర్ ను కలుసుకోగా రాహుల్ గాంధీని అప్యాయంగా హత్తుకున్నారని గుర్తుచేసుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారి సంఖ్య తగ్గిపోతుందని, కానీ సాటి వారి కోసం పోరాటం కొనసాగించిన ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ లేకపోవడం రాష్ట్ర సమాజానికి, వెనుకబడ్డ వర్గాలకు తీరని లోటు అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.


గద్దర్ మృతి పట్ల వైఎస్ షర్మిల రెడ్డి దిగ్భ్రాంతి
గద్దర్ మృతి అత్యంత విషాదభరితమైన వార్త అని, ఆయన మృతిపట్ల YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాపోరాటాల మహాశిఖరం ఒరిగిపోయిందని, మానవత్వం, త్యాగనిరతి, మహోన్నతమైన వ్యక్తిత్వం, ప్రజల గొంతు మూగపోయింది అన్నారు. గద్దరన్న ఇక లేడన్న వార్త కలిచివేసేదిగా ఉంది. యావత్ జీవితం ప్రజలకొరకు చేసే పోరాటాలకు అంకితం చేసిన మీ బాట, మీ పాట భావితరాలకు చుక్కానిగా, బడుగు దీనజనుల గుండెల్లో ఆశాదీపంగా అజరామరంగా నిలుస్తుందన్నారు.  సలసల మండే గుండెమంటల రాగంతో వలవల జారే కన్నీళ్ళ తాళంతో పాడిన ప్రతి గేయం అమరం. ఓ పోరాటయోధుడా అందుకో సలాం అని గద్దర్ మృతిపై షర్మిల స్పందించారు.