రెండు రోజులుగా ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. నేడు గవర్నర్‌తో తెలంగాణ ఆర్ అండ్ బీ అధికారులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. వారి వివరణ అనంతరం ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది.


అసెంబ్లీ సమావేశాల పొడిగింపునకు అవకాశం?


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బిల్లు నేపథ్యంలో చర్చకు సమయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చకు ఈ ఒక్కరోజు సమయం సరిపోదని విపక్షాలు కోరడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.  


ముందు గవర్నర్ వద్దకు ఎందుకంటే?


తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో భాగంగా సంబంధిత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామూలుగా అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కిందికి వస్తుండడం వల్ల గవర్నర్ వద్దకు వెళ్లింది.


గవర్నర్ లేవనెత్తిన అంశాలు ఇవే


తొలుత ప్రభుత్వం పంపిన వివరణతో సంతృప్తి చెందని ఆమె 6 అంశాలపై వివరణలు కోరారు. 
1. కేంద్ర వాటా 30 శాతం ఉన్నందున కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమా కాదా? 
2. ఆర్టీసీ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు సమర్పించాలి. 
3. తాత్కాలిక ఉద్యోగుల ప్రయోజనాల రక్షణకు తీసుకున్న చర్యలేంటి? 
4. ఆర్టీసీ స్థిర, చరాస్తుల వివరాలు తెలపాలి. ఆర్టీసీ స్థలాలు, భవనాలను ప్రభుత్వం తీసుకుంటుందా?  
5. బస్సులు, ఉద్యోగుల నిర్వహణను ఎవరు చూస్తారు? సిబ్బంది ప్రయోజనాల రక్షణలో కార్పొరేషన్ పాత్ర ఎలా ఉంటుంది? 
6. ఆర్టీసీ ఉద్యోగులు డిప్యుటేషన్ పై సంస్థలోనే పనిచేస్తారా? అని ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు.


తాను ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని కొన్ని విషయాలపై స్పష్టత అడుగుతున్నానని, బిల్లును అడ్డుకునే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని తమిళిసై నిన్న కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.