Telangana Assembly Session extended: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది. సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. నేటి ఉదయం తెలంగాణ ఆర్ అండ్ బీ అధికారులు గవర్నర్‌ తమిళిసై సమావేశం అయ్యారు. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. వారి వివరణ అనంతరం ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది.


టీఎస్‌ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం దిశ‌గా సంబంధిత బిల్లును మరికాసేపట్లో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ బిల్లుతో పాటు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే వాటిపై చర్చకు నేడు సమయం సరిపోదని భావించిన సర్కార్ మరో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తమకు సంబంధించిన బిల్లును గవర్నర్ ఆమోదించడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు  ఛ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపు ఇచ్చారు. శనివారం రెండు గంటల పాటు బస్సు సేవల్ని నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. చివరికి ఆర్టీసీ సిబ్బంది తమ పంతం నెగ్గించుకున్నారు.


ఆర్టీసీ బిల్లు ముందు గవర్నర్ వద్దకు ఎందుకంటే?
సాధారణంగా అయితే ముందు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సంబంధిత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం పంపించారు. ఆర్థిక బిల్లు కావడంతో ముందుగా గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. గవర్నర్ అనుమతితోనే ఆర్థిక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రెండు రోజుల సస్పెన్స్ తరువాత ఆర్థిక బిల్లు అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం నుంచి పలు అంశాలపై స్పష్టం తీసుకున్నాక ఆర్టీసీ బిల్లును ఆమె ఆమోదించారు.