Balapur Ganesh Laddu Auction 2024: హైదరాబాద్ లో మనకు ఎక్కువగా వినిపించే వినాయకులు ఒకటి ఖైరతాబాద్ మహాగణపతి కాగా, రెండో గణేష్ బాలాపూర్ వినాయకుడు. కొన్ని దశాబ్దాల నుంచి ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ లో గణేష్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 70 ఏళ్లు పురస్కరించుకుని, ఈ ఏడాది 70 అడుగుల ఖైరతాబాద్  మహాగణపతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రితో భక్తుల సందర్శన ముగిసింది. ప్రస్తుతం అందరి నోటా వినిపించే మాట బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించే బాలాపూర్ లడ్డూ వేలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రూ.450తో మొదలైన నేడు లక్షల్లో బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంపాటలో దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు.

రూ.450తో మొదలై రూ.27 లక్షలకు చేరిన బాలాపూర్ లడ్డూ వేలం..
ఈ సారి అయోధ్య రామాలయ నమూనాలో బాలపూర్ గణపతిని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర మొదలైన తర్వాతే హైదరాబాద్ లో మిగిలిన మండపాలనుంచి గణనాథులను కదిలిస్తారు. బాలాపూర్ గణేష్ ప్రత్యేకత ఏంటంటే.. లడ్డూ వేలం పాట. ప్రతి ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ ధర రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ఎంత ధర పలుకుతుందో అని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరి పూజ అనంతరం బాలాపూర్‌ బొడ్రాయి దగ్గర వేలం పాటను బాలాపూర్ గణేష్ ఉత్సవసమితి నిర్వహిస్తుంది. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. మొదటగా 1994లో మూడు దశాబ్దాల కింద బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభించారు. ఆ ఏడాది వేలంపాటలో రూ.450కి లడ్డూను ఓ భక్తుడు దక్కించుకోగా.. 2023లో రూ.27 లక్షల రికార్డు ధర పలికింది. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు, కాగా ఇక్కడి గణేషుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెట్టే సంప్రదాయం 1980లో మొదలైంది. 

9 ఏళ్లకు లక్షకు చేరిన బాలాపూర్ లడ్డూ
1994లో కొలను మోహన్ రెడ్డి రూ. 450కి బాలాపూర్ లడ్డూ సొంతం చేసుకున్నారు. మరుసటి ఏడాది ఆయనే రూ.4500కి వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. మూడో ఏడాది 1996లో నాలుగు రెట్లు పెరిగి రూ.18 వేలకు చేరింది. 1998 వేలంలో లడ్డూ ధర రూ.50 వేలు దాటింది. కొలను మోహన్ రెడ్డి రూ.51 వేలకు లడ్డూ సొంతం చేసుకున్నారు. 2001లో బాలాపూర్ లడ్డూ లక్ష రూపాయాలు దాటింది. కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు బాలాపూర్ గణేషుడి లడ్డూను పాడారు. 

2007లో రూ.5 లక్షలకు, 2014లో 10 లక్షలు దాటిన లడ్డూ వేలం
2007లో బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.5 లక్షల మార్క్ చేరింది.  కొలను మోహన్ రెడ్డి అనే భక్తుడు రూ. 5.07 లక్షలకు వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. క్రమంగా పెరుగతున్న బాలాపూర్ లడ్డూ ధర 2014లో ఏకంగా రూ.10 లక్షలకు చేరింది. ఆ ఏడాది కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు లడ్డూ పాడారు. 

రికార్డ్ ధర రూ.27 లక్షలు
2015లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65 లక్షలకు, 2016లో నాగం తిరుపతి రెడ్డికి రూ.15.60 లక్షలకు గణేష్ లడ్డూ వెళ్లింది. 2022లో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.20 లక్షల మార్క్ చేరింది. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి వేలంపాటలో రూ. 24 లక్షల 60 వేలకు లడ్డూ పాడారు. గత ఏడాది 2023లో దాసరి దయానంద్‌ రెడ్డి రూ.27 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డూ దక్కించుకున్నారు. ఈ ఏడాది ముప్ఫై లక్షల మార్క్ చేరుతుందా అని చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా 2020లో వేలం పాట నిర్వహించలేదని తెలిసిందే.

ఇప్పటివరకు లడ్డూ దక్కించుకున్న వ్యక్తులు 

సంవత్సరం  దక్కించుకున్న భక్తులు వేలంలో లడ్డూ ధర 
1994  కొలను మోహన్ రెడ్డి రూ. 450 
1995 కొలనుమోహాన్ రెడ్డి   రూ.4500 
1996 కొలను కృష్ణారెడ్డి  రూ.18 వేలు
1997  కొలను కృష్ణారెడ్డి  రూ.28వేలు
1998  కొలను మోహన్ రెడ్డి  రూ. 51వేలు
1998 కళ్లెం ప్రతాప్ రెడ్డి  రూ.65వేలు
1999  కళ్లెం అంజిరెడ్డి  రూ.66వేలు
2000  జి. రఘునందన్ చారి  రూ.85వేలు
2001 కందాడ మాధవరెడ్డి  రూ.1.05లక్షలు
2002 చిగురంత తిరుపతిరెడ్డి  రూ.1.55లక్షలు
2003 కొలను మోహన్ రెడ్డి  రూ.2.01లక్షలు
2004 ఇబ్రహీం శేఖర్  రూ.2.08లక్షలు
2005 చిగురంత తిరుపతి రెడ్డి  రూ.3 లక్షలు
2006 జి.రఘునందన్ చారి  రూ.4.15లక్షలు
2007  కొలను మోహన్ రెడ్డి  రూ. 5.07 లక్షలు
2008 సరిత రూ.5.10లక్షలు
2009 కొడలి శ్రీధర్ బాబు  రూ. 5.35లక్షలు
2010 కొలను బ్రదర్స్   రూ. 5.45లక్షలు
2011  పన్నాల గోవర్థన్  రూ. 7.50లక్షలు
2012 తీగల కృష్ణారెడ్డి  రూ.9.26లక్షలు
2013 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి  రూ. 9.50లక్షలు
2014 కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి  రూ. 10.32 లక్షలు
2015 స్కైలాబ్ రెడ్డి  రూ. 14.65లక్షలు
2016 నాగం తిరుపతి రెడ్డి  రూ.15.60 లక్షలు
2017   తిరుపతిరెడ్డి రూ. 15 లక్షల 60 వేలు
2018   శ్రీనివాస్‌ గుప్తా  రూ. 16 లక్షల 60 వేలు 

2019 కొలను రాంరెడ్డి రూ.17.60 లక్షలు

2021 మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్ రూ. 18.90 లక్షలు

2022
 వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24 లక్షల 60 వేలు

2023 దాసరి దయానంద్‌ రెడ్డి రూ. 27 లక్షలు