Telangana Government Released A Runamafi GO In Telugu Language:  తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందినీయమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రైతు రుణమాఫీ జీవోను తెలుగులో జారీ చేయడంపై ఆయన ఎక్స్‌(X) వేదికగా ఓ పోస్టు పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్‌ను అభినందించారు. 
"ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై  తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. " అని అభిప్రాయపడ్డారు. 


 




ప్రజల కోసమే ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అవి వారికి అర్థమయ్యే భాషలో విడుదల చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. "ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా.అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ  తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు. 


తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా తెలుగులోనే కార్యకలాపాలు సాగించాలని ప్రజలకు అర్థమయ్యేలా తెలుగులోనే అన్నీ విడుదల చేయాలని సూచించారు వెంకయ్యయ. "రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నాను." అని ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.