Telangana News: తెలంగాణలో రుణ మాఫీపై రాజకీయ రణరంగం సృష్టిస్తోంది. రుణమాఫీకి రేషన్ కార్డును ప్రాతిపధికగా చేసుకోవడంపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నమ్మకద్రోహంగా ఆరోపిస్తున్నాయి. భేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకునేందుకే ప్గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదని మండిపడుతున్నాయి. 


రైతులందరికీ మాపీ చేయాల్సిన ప్రభుత్వం వడపోతకు ఎక్కువ ప్రధాన్యాత ఇచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. 2018 డిసెంబర్‌12 కంటే ముందు ఉన్న వారి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు రుణభారం తగ్గిస్తుందని అనుకుంటే... ప్రభుత్వం తన భారాన్ని దించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రేషన్ కార్డు, ప్రామాణికం అంటేనే లక్షల మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 




రైతులకు రుణమాపీ చేస్తామని ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాయమాటలతో మభ్యపెడుతోందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్న వారి జాబితాను వెంటనే రిలీజ్ చేయాలని మార్గదర్శకాలను కూడా సవరించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వాళ్లు, పింక్ కార్డు ఉన్న వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. 
ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ. ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... అందరికీ రుణమాఫీ ఇవ్వలేక ప్రభుత్వం కొత్త కథలు చెబుతోందని మండిపడ్డారు. ఎన్నికల టైంలో హామీ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతులు గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు అదే రేషన్ కార్డును ప్రామాణికంగా ఎలా తీసుకుటుందని నిలదీశారు. 


రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీఎం కిసాన్ డేటాకు జోడిస్తే చాలా మంది నష్టపోతారని చెబుతున్నారు. రేషన్ కార్డుతో ముడిపెట్టడమే కాకుండా స్వల్ప కాలిక పంట రుణాలకే మాఫీ వర్తిస్తుందని చెప్పడం కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బే అంటున్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువత నిరసనలు చేస్తున్నారని ఇప్పుడు రైతులు కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.