Telangana Rains Telugu News Updates | హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లో సోమవారం రాత్రి తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు నమోదు కానుందని పేర్కొన్నారు. పశ్చిమ దిశ, నైరుతి దిశల నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నంచి అతి భారీ వర్షాలు పడుతున్న మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో చెట్ల కిందగానీ, పాత బిల్డింగ్ లలో తల దాచుకోవడం చేయకూడదని ప్రజలకు సూచించారు. జులై 15 నుంచి జులై 18 వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
మంగళవారం, బుధవారం మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారంటే వర్షాలతో అధిక ప్రమాదం ఉందని సంకేతం. పలు ప్రాంతాలలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలలో నీళ్లు నిలిచిపోతాయి. చాలా ఏరియాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండనుంది. కొన్నిచోట్ల వర్షాలు, ఈదురుగాలుకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం జరుగుతాయి. కొన్ని గంటలపాటు గంటలపాటు విద్యుత్, నీరు లాంటి సౌకర్యాలకు అవాంతరం తలెత్తుతుంది. అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు సలహాలు జారీ చేయాలి. మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా హెచ్చరికల ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేయాలి.
ఏపీలో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు
వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురవనున్నాయి. ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి కారణంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. జులై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.