Hyderabad Food Adulteration : ప్రస్తుతం ప్రజల జీవనశైలి(Life Style) మారింది. జీవితం బిజిబిజి గజిబిజి అయిపోయింది. ఉదయం లేస్తే చాలు ఉరుకుల పరుగులమయం అయింది. కనీసం ఇంట్లో వండుకుని తినేంత టైం కూడా ఉండడం లేదు. దీంతో ఎక్కువగా బయట ఫుడ్(Food) తినడానికే జనాలు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఫుడ్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పాడైన ఫుడ్ కు రంగులద్ది కస్టమర్ల(customers)కు ఒడ్డిస్తున్నారు. దీంతో ఈ ఫుడ్ తిన్న వాళ్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇది ప్రతి చోట జరుగుతూనే ఉంది. 


మన రాజధాని హైదరాబాద్(Hyderabad)​ మహానగరంలో ఫుడ్​ కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది. చిన్న చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన విక్రయించే తినుబండారాలు, పానీయాల్లోనే కాకుండా నగరంలోని కొన్ని పేరుమోసిన రెస్టారెంట్లలో కూడా ఫుడ్​ కల్తీ జరుగుతోంది. జంటనగరాల్లో  నాసిరకం ఆహార పదార్థాలపై  జీహెచ్ ఎంసీ(GHMC) పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా మంది అంటున్నారు. కల్తీ  నూనెలు, మసాలా దినుసులు(Spices) వాడడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు సోకుతాయని నిపుణులు చెబుతున్నారు. 


భారీగా రెస్టారెంట్లు, హోటల్స్ 
హైదరాబాద్ లో ప్రతేడాది ఫుడ్ బిజినెస్(Food Business) పెద్ద మొత్తంలో జరుగుతుంది. జంట నగరాల్లో ఎక్కడ చూసిన హోటళ్లు(Hotels), రెస్టారెంట్లు భారీగా కనిపిస్తుంటాయి.  వీకెండ్స్ వస్తే చాలు చాలామంది కుటుంబంతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే అన్నట్లు ప్రవర్తిస్తుంటారు.  పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు  ఆహార ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తాయన్న భావన అందరిలో ఉంటుంది. కానీ చాలాచోట్ల అలాంటి పరిస్థితులు ఉండవన్న సత్యం వారికి తెలీదు. అధికారులు అలాంటి రెస్టారెంట్లపై ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో వారి డొల్లతనం బయటపడుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. 






టాస్క్ ఫోర్స్ బృందాలు సోదాలు 
రీసెంట్ గా హైదరాబాద్ లోని లక్డీకాపుల్ పరిధిలోని పలు హోటళ్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇందులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాడైపోయిన ఆహార పదార్థాలు వాడడంతో పాటు ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లను కూడా ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి. 


వాటిలో ప్రముఖంగా క్రీమ్ స్టోన్ , న్యాచురల్స్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ హౌస్,  రాయలసీమ రుచులు, షా గౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్ , మాకౌ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకో బెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్ జో , ఖాన్ సాబ్ , హోటల్ సుఖ్ సాగర్ , జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, కృతుంగ, రెస్ట్ ఓ బార్ ఉన్నాయి.


లక్డీకాపుల్ లోని 'రాయలసీమ రుచులు'( Rayalaseema Ruchulu) హోటల్ లో అధికారులు తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున పాడైపోయిన ఆహారపదార్థాలను గుర్తించారు. ఇదే ప్రాంతంలో ఉన్న షా గౌస్(Shah Ghouse) లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ  ఆహార పదార్థాల నిల్వ నిర్వహణ పద్ధతులు సరిగా లేవని తేల్చారు. పరిశుభ్రతతో పాటు నీటి సమస్యలను గుర్తించారు. కొన్ని ఆహారపదార్థాలను విశ్లేషించేందుకు ల్యాబ్ కు పంపినట్లు  అధికారులు  ప్రకటించారు. ఖైరతాబాద్ లోని కామత్ హోటల్ లో దాదాపు రూ.25వేల విలువైన మ్యాను ఫ్యాక్చరింగ్ డేట్ లేని నూడిల్స్ తో పాటు టీ పొడి(Tea Powder) ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు . హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు అక్కడ దొరికే ఆహారాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని పలువురు అధికారులు  సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.