TS EDCET 2024 Entrance Exam: తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 23న నిర్వహించనున్న టీఎస్‌ఎడ్‌సెట్-2024 (TS EDCET-2024) పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలంగాణలోని ముఖ్య పట్టణాలతోపాటు ఏపీలోని విజయవాడ, కర్నూలు కలిపి మొత్తం 79 సెంటర్లలో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ప్రకటించిన షెడ్యూలు.. ప్రకారం మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల బాధ్యత చేపట్టింది. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను మే 20న విడుదలచేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


టీఎస్ ఎడ్‌సెట్-2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ..
మే 23న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరిగే ఎడ్‌సెట్ పరీక్షకు ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందుగానే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 


పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు.


అర్హత మార్కులు ఇలా.. 
పరీక్షలో అర్హత మార్కులను 25 శాతం (38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.


పరీక్ష కేంద్రాలు..
హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ వెస్ట్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్ధిపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట, కర్నూలు, విజయవాడ.



విద్యార్థులకు ముఖ్య సూచనలు..


➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.


➥ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు లేదా కాలేజీ ఐడీ కార్డును పరీక్ష రోజు తీసుకెళ్లాలి.  


➥  సెల్‌ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 


➥ అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించరు.  


➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఫోటోలు, బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే పరీక్షకు తీసుకెళ్లాలి. 


➥ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.


➥ పరీక్ష సమయం ముగిసేవరకు బయటకు అనుమతించరు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..