Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో కాసేపు కలకలం రేగింది. ఉదయం హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్ బయల్దేరిన మలేషియా ఎయిర్లైన్స్  విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన పైలట్‌ అప్రమత్తమయ్యాడు. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరాడు. 


అప్పుడే టేకాఫ్‌ అయిన ఫ్లైట్‌ ల్యాండింగ్‌కు అనుమతి కోరడంతో కాసేపు గందరగోళం నెలకొంది. విమానాశ్రయం నుంచి అనుమతి వచ్చే వరకు కూడా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అలా మూడు సార్లు విమానం చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండింగ్‌కు ఏటీసీ అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రమాద తీవ్రను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.  


అప్పటి వరకు అందులో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకొని భయపడిపోయారు. అయితే ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వడంతో మలేషియా ఎయిర్లైన్స్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది.


విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో అప్పటి వరకు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయపడిన 130 మంది ప్రయాణికులు, అందులో ఉన్న సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఇంజిన్‌లో మంటలు గుర్తించి ఏటీసీ అధికారులను అప్రమత్తం చేసి సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేసిన పైలట్‌ను ప్రయాణికులు ధన్యవాదాలు చెప్పారు.