ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తుండగా, తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చనిపోయేందుకు 10 రోజులు ముందే ప్రణాళిక చేసుకున్న పోలీసులు గుర్తించారు. నొప్పి లేకుండా ఎలా చనిపోవాలని ఆమె ఇంటర్నెట్ లో వెతికినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు అంతా ఉంటారు కాబట్టి, బొటిక్‌లో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.
పోలీసు వర్గాలు వెల్లడించిన ప్రకారం.. లోపలి వాష్ రూంలో గాలి బయటకు వెళ్లకుండా సిద్ధం చేయించారు. వారం రోజుల క్రితమే ఓ కార్పెంటర్ ని పిలిపించి, వాష్ రూం కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతంలో ఉండే సందులను మూసేయించారు. ఆమె స్టీమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పక్కనే కార్బన్ మోనాక్సైడ్ సీసాను కూడా గుర్తించారు. అయితే, ఆమె ఫోనును కూడా పోలీసులు పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి పాస్‌వర్డ్ ఉండడంతో టెక్నాలజీ నిపుణుల సాయంతో దాన్ని ఓపెన్ చేయించి పరిశీలిస్తామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. మృతదేహం వద్ద లభించిన కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడ కొన్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఒంటరితనం భరించలేకేనా?
కొద్దికాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్న ఆమె అందులో నుంచి బయటపడే మార్గం కనిపించలేదని భావిస్తున్నారు. తరచూ స్నేహితులు, బంధువుల వద్ద నిరాశను వ్యక్తం చేస్తూ ఉండేవారని, అయితే, తనలో ఇంత ఒత్తిడి ఉందనే విషయాన్ని తాము గుర్తించలేకపోయామని బంధువులు చెప్పుకొచ్చారు. మొత్తానికి తాను కోరిన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాననే బాధతోనే చనిపోవాలని ప్రత్యూష నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనింగ్
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, శృతి హాసన్, దీపికా పదుకొణె, ఛార్మి, త్రిష, నిహారిక వంటి సినీతారలకు ప్రత్యూష డ్రెస్సులు డిజైన్ చేశారు. అనేక మంది సెలబ్రిటీలు ప్రత్యూష వర్క్స్‌ను ఎండార్స్ చేశారు. సౌత్ ఇండియాలో చాలా మంది హీరోయిన్లందరికీ ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు. తన పేరునే బ్రాండ్ నేమ్‌గా మార్చేసి, ఫ్యాషన్ ప్రపంచంలో ఎదిగారు.
బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ నుంచి మాస్టర్ డిగ్రీ చేసిన ప్రత్యూష తొలుత తన తండ్రికి చెందిన ఎల్ఈడీ తయారీ వ్యాపారంలో అడుగుపెట్టారు. కాని అది తన రంగం కాదని గుర్తించిన ఆమె ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చారు. సొంతంగా తన పేరుతోనే లేబుల్ క్రియేట్ చేశారు. 2013లో ఈ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు.
ఉపాసనకు దగ్గరి స్నేహితురాలు
ప్రత్యూష ఆత్మహత్యపై పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉపాసన కామినేని కొణిదెల తనతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘మై బెస్టీ, నా బెస్ట్ ఫ్రెండ్ మరణంతో షాక్‌కు గురయ్యా. నాకు చాలా మంచి స్నేహితురాలు, చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి పోయింది. అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఆలోచించేది, ఇలా ఒత్తిడికి లోనవుతుందని అనుకోలేదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’’ అని ప్రార్థించారు.