Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్‌లోని పలు ప్రాంతాలకు, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకతో పాటు పశ్చిమ, మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి వేగంగా ముందుకు కదులుతున్నాయి. వాస్తవానికి ఏపీ, తెలంగాణలో ఇదివరకే రుతుపవనాలు వచ్చి వర్షాలు కురవాల్సి ఉంది. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. 


మరో మూడు రోజుల్లో  ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి, మొత్తం ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉంది. నేడు ఏపీ, తెలంగాణ సహా బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఏపీలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుఅవుతున్నాయి. ఊష్ణతాపం నుంచి విలవిలలాడిపోతున్నారు. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 






ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవన వర్షాలు ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో భానుడి భగభగలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కోసం రైతన్నలు ఎదురుచూపులు మరో మూడు, నాలుగు రోజుల్లో ఫలించనున్నాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. నైరుతి రుతుపవనాల వర్షాలు ఇంకా మొదలుకానందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 4 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.


తెలంగాణలో వడగాల్పులు, వర్షాలు
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఓ వైపు వడగాల్పులు, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండనుంది. కానీ మధ్యాహ్నానికి హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.