బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణం మీద ఆశ వదిలేసుకుంటారు చాలా మంది. సెలెబ్రిటీలు, కోటీశ్వరులు మాత్రం విదేశాలకు వెళ్లి ‘కార్ - టి సెల్’ అనే చికిత్స తీసుకుని వస్తారు. ఆ చికిత్స మొన్నటి వరకు మన దగ్గర లేదు. అందరూ విదేశాలకు వెళ్లి ఆ చికిత్స తీసుకోలేరు కనుక, అనేక ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఇప్పుడ ‘కార్ - టి సెల్’ మనదేశంలో కూడా అందుబాటులోకి రానుంది. ఏడాది ఓపిక పడితే చాలు ఇండియాలో ఈ చికిత్స ఇవ్వడం ప్రారంభిస్తారు. మనదేశంలో ఏటా 40 వేల నుంచి 50 వేల దాకా బ్లడ్ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్ బారిన పడుతున్న రోగల సంఖ్య ఉన్నట్టు గుర్తించారు. 


ఏంటి చికిత్స?
బ్లడ్ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్ (శరీరంలోని లింఫ్ నోడ్స్ దగ్గర వచ్చిన క్యాన్సర్)సమర్థవంతమైన చికిత్స ‘కార్ టి సెల్ థెరపీ’. దీని పూర్తి పేరు Chimeric antigen receptor T cell Therapy. టి కణాలు రోగనిరోధక శక్తిలో చాలా ముఖ్యపాత్ర పోషించే తెల్ల రక్తకణాలు.  బ్లడ్ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్లను వీటి ద్వారా నయం చేసే థెరపీ ఇది. రోగి శరీరంలోని టి కణాలను, శరీరంలోనే ఉన్న క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా చేస్తారు. టి కణాలను మరింత శక్తివంతంగా తయారుచేస్తారు. 


ఎంత ఖర్చు?
ఈ కార్ టి సెల్ థెరపీ మన దేశంలో లభించడం లేదు. దీంతో డబ్బున్న వారు అమెరికా వెళ్లి ఈ చికిత్స చేయించుకుని వస్తున్నారు. అక్కడ వారికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుంది. ఈ చికిత్సను మన దేశలోనే రూ.20 నుంచి  30 లక్షల్లో అందించేందుకు ‘ఇమ్యునోయాక్ట్’ అనే సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు చాలవరకు విజయవంతం అయినట్టు చెబుతోంది. దాదాపు వచ్చే ఏడాదిలో ఈ చికిత్సను అందబాటులో తెచ్చే అవకాశం ఉంది. 


ఏ స్టేజ్‌లో ఉంటే?
బ్లడ్ క్యాన్సర్, లింఫోమ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగుల్లో చివరి స్టేజ్ లో ఉన్న వారికి ఈ కార్ టి సెల్ థెరపీ ఇస్తారు. అయితే ముందు కీమో థెరపీ, బోన్ మ్యారో (మూలుగు మార్పిడి) ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి చికిత్సలు చేశాక, వాటి వల్ల ఉపయోగం లేకపోతేనే ఈ థెరపీ ప్రయత్నిస్తారు. అలాగే క్యాన్సర్ తగ్గి, మళ్లీ మళ్లీ తిరగబెడుతున్న వారు కూడా ఈ చికిత్సకు అర్హులే. విదేశాల్లో జరిగిన పరిశోధనల ప్రకారం పిల్లలపై ఈ చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. 


ప్రస్తుతం ఈ చికిత్సకు సంబంధించి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. ఆ ట్రయల్స్ లో పాల్గొన్న రోగులంతా ఆరోగ్యంగానే ఉన్నారు. రెండో దశలో మరో 40 మంది రోగులపై చికిత్స చేయనున్నారు. అది కూడా సక్సెస్ అయితే వచ్చే ఏడాది చికిత్సను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఐఐటీ బాంబేలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రాహుల్ పన్వర్ ‘ఇమ్యునోయాక్ట్’ సంస్థను స్థాపించారు. 



Also read: మీకు ఇంజెక్షన్ అంటే భయమా? అయితే మీ భయం పేరిదే


Also read: శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? జరిగేది ఇదే