చాలామంది మధుమేహంతో బాధపడుతున్నవారు సమయానికి మందులు వేసుకోరు. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడో, అనారోగ్యంగా అనిపించినప్పుడో మాత్రమే వేసుకుంటారు. ఇలా చేయడం మధుమేహం సమస్య ముదిరిపోతుంది. రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి పరిస్థితి చేయిదాటి పోవచ్చు కూడా. అందుకే మధుమేహం ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోకపోతే ఏమవుతుందో తెలుసా?
ఈ సమస్యలు తప్పవు
చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే ఆ ప్రభావం అన్ని ప్రధాన అవయవాల మీద పడుతుంది. ముఖ్యంగా కంటి చూపు పోయే ప్రమాదం పొంచి ఉంది. హార్ట ఎటాక్ కూడా రావచ్చు. కిడ్నీలు చెడిపోయే ముప్పు అధికం. కాళ్లపై పుండ్లు ఏర్పడి, అవి ఇన్ఫెక్షన్ గా మారిపోతుంది. దీని వల్ల చివరికి కాలు తీసేసే ప్రమాదం కూడా ఉంది. మధుమేహం వల్ల కోల్పోతున్న ప్రాణాలు సంఖ్య కూడా అధికంగానే ఉంది.రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటూ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చేతులు శక్తి హీనంగా మారుతాయి. ఏ పనీ చేయలేరు.చిన్న బరువును కూడా ఎత్తలేరు. ముఖంపై ఓ వైపు స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉంది.కళ్లు వెనుక భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. ఏకాగ్రత ఉండదు. అందుకే డయాబెటిస్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు సూచించిన మందులు రోజూ వేసుకుంటూ, ఆహారపరంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే శారీరక వ్యాయామానికి సమయం ఇవ్వాలి. వాకింగ్ చేయడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
లక్షణాలు ఇవిగో...
డయాబెటిస్ ఉన్న వారిలో అతిగా దాహం వేయడం, అతిగా ఆకలి వేయడం, కంటి చూపు మసకబారడం, తీవ్రమైన అలసట, రాత్రిపూట అధికంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉత్సాహం, చురుకుదనం లేకుండా డల్ గా ఉండడం కూడా జరుగుతుంది.వీరికి దెబ్బ తగిలితే ఆ గాయం కూడా త్వరగా మానదు. చాలా రోజుల సమయం తీసుకుంటుంది.
జాగ్రత్త...
డయాబెటిస్‌లో ఇప్పుడు ఎక్కువ మందిని ఎటాక్ చేస్తున్నది టైప్2 డయాబెటిస్. చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, అతిగా భావోద్వేగాలకు గురవ్వడం, మానసిక ఆందోళనలకు గురవ్వడం వంటి వాటి వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇక టైప్ 1 వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే క్లోమ గ్రంథి సరిగా పనిచేయకపోయినా వస్తుంది. టైప్ 1తో పోలిస్తే ప్రపంచంలో టైప్ 2 తో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువ.
Also read: తరచూ గుండె వేగంగా కొట్టుకుంటోందా? ఇవే కారణాలు కావచ్చు
Also read: నీళ్లు తక్కువ తాగితేనే కాదు, అధికంగా తాగినా ఈ సమస్యలు తప్పవు