ఇంజెక్షన్ చూస్తేనే వణికిపోతారు కొంతమంది. పిల్లలు వణికారంటే అర్థం ఉంది, పెద్ద వాళ్లు కూడా పారిపోతారు. అంతెందుకు కోవిడ్ టీకా వేయించుకోవడానికి భయమేసి చెట్టెక్కి కూర్చున్న వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చిన్నప్పట్నించే కొందరికి సూదిని చూస్తే భయం. వారు ఎట్టి పరిస్థితుల్లో ఇంజెక్షన్‌కు ఒప్పుకోరు. నిజానికి దీన్ని చాలా మంది నవ్వుతూ తీసుకుంటారు, అదొక ఫోబియా అని గుర్తించరు. ఇంజెక్షన్ వేయించుకునేందుకు భయపడడాన్ని ట్రిపనోఫోబియా (Trypanophobia) అంటారు. పదునైన వస్తువులు గుచ్చుకుంటాయేమో అన్న భయమే పెరిగి పెద్దయ్యాక ఇలా ట్రిపనోఫోబియాగా మారుతుంది.
ఎందుకు వస్తుంది?
ఇలాంటి ఫోబియాలు చాలా ఉన్నాయి. అవెందుకు వస్తాయన్నది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు వైద్యులు. ప్రతి మనిషికి ఏదో ఒక భయాలు ఉండడం సహజమని అలా కొందరికీ ఈ భయం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నప్పుడు కాస్త ఊహ తెలిశాక వారికి పదునైన వస్తువుల వల్ల తగిలిన గాయాలు కూడా వారిలో ఇలాంటి ఫోబియాను పెంచే ఛాన్సు ఉంది. లేదా ఇంట్లో పెద్దవాళ్లెవరైనా అనారోగ్యాలు పాలై వారు ఇంజెక్షన్లు తీసుకునేందుకు పడుతున్న బాధను చూసి కూడా కొందరి పిల్లల్లో ఈ ఫోబియా మొదలవ్వచ్చు. ఇలా ఫోబియాలు ఒకసారి మొదలైతే పెరుగుతాయే కానీ తరగవు.
ఆ ఫోబియా పోదా?
ఇలాంటి ఫోబియాలను వదిలించుకోవాలంటే మానసిక వైద్యుల సహాయం అవసరం. ఎవరికీ వారు ఫోబియాల నుంచి బయటపడలేరు. థెరపీల ద్వారా ఫోబియాలను పొగొట్టే అవకాశం ఉంది. ఇందుకు ఒక్కోసారి నెల రోజుల నుంచి ఏడాది వరకు కూడా సమయం పట్టచ్చు. పలు సెషన్ల ద్వారా భయన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. కొందరిలో ఈ భయం థెరపీ తీసుకున్నాక పూర్తిగా పోకపోయినా, సగానికి పైగా ఫోబియా తగ్గే అవకాశం ఉంది. మిగతా యాభైశాతం సొంతంగా అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి.
ఇదో వింత ఫోబియా...
అన్నింట్లో కన్నా ప్రపంచంలో ఓ వింత ఫోబియా ఉంది. అదే ‘అరాకిబ్యూటిరో ఫోబియా’. అంటే ఏంటో తెలుసా? పీనల్ బటర్ తిన్నప్పుడు అది నోటిపైన అంగిలికి అతుక్కుంటుదేమో అన్న భయం. అదేం ఫోబియా? అలా అతుక్కుంటే మాత్రం ఏమవుతుంది? అనే వాళ్లు ఉన్నారు. అదే మరి సాధారణ వ్యక్తులకు, ఫోబియాలతో బాధపడేవారికి తేడా. కొన్ని ఫోబియాలు పెద్దయ్యాక కూడా ప్రారంభమవుతాయి.
Also read: శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? జరిగేది ఇదే
Also read: తరచూ గుండె వేగంగా కొట్టుకుంటోందా? ఇవే కారణాలు కావచ్చు