Rains in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ - గోపాల్‌పూర్ మధ్యలో శనివారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం తీరం దాటుతున్న సమయంలో వేగంగా ఈదురుగాలులు వీస్తాయి. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ సహాలు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ జీహెచ్ఎంసీ ప్రజల్ని అలర్ట్ చేసింది. శనివారం సాయంత్రం, రాత్రి వేళ రెండు నుంచి మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హైదరాబాద్ వెదర్ మ్యాన్ సైతం సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో మూసీ నది ఉప్పొంగి ప్రవహించనుందని, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల వర్షపు నీటితో రోడ్లు బ్లాక్ అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వర్షాల సమయంలో భారీగా వర్షపు నిలిచిన చోట రోడ్లు దాటే ప్రయత్నం చేయకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరో రెండు రోజుల పాటు దక్షిణ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్ లకు భారీ వర్ష సూచన ఉంది. నాగర్ కర్నూల్, రంగారెడ్డి, ములుగు, మహబూబాబాద్, భద్రాత్రి, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అత్యధికంగా నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వానలు ప్రభావం చూపనున్నాయి.
హైదరాబాద్ లో రెండు నుంచి మూడు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 20 నుంచి 30 సెంటీమీటర్ల మేర కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. ఇంకా చెప్పాలంటే 2020లో వచ్చిన భారీ వర్షాలు మరోసారి రిపీట్ అవుతాయని.. హైదరాబాద్ వాసులు నేడు వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచించారు. నీటి ప్రవాహం దాటే ప్రయత్నం చేయవద్దని, లోతు తెలియని చోట నీళ్లలో నడుచుకుంటూ వెళ్లడం లాంటివి చేయవద్దని అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేశారు.