Telangana News: తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. పాలమాకుల గురుకుల పాఠశాలను బీఆర్‌ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి జరుగుతున్న పరిణామాలు, చదువు, ఫుడ్‌, ఇతర సమస్యల గురించి తెలుసుకున్నారు. 


పాఠశాలలో సరైన ఫుడ్ పెట్టడం లేదని హరీష్‌రావు దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు, తమతోనే వంట చేయిస్తున్నారని సరైన వసతులు లేవని అడిగితే తిడుతున్నారని కొడుతున్నారని వాపోయారు. తమకు ఎదురవుతున్న సమస్యలు చెప్పుకొని బోరున విలపించారు విద్యార్థులు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే స్పందించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదా అని నిలదీశారు. అసలు సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి పెట్టే తీరక సీఎంకు ఉందా లేదా అని ధ్వజమెత్తారు. 






ఇన్ని సమస్యలు గురుకుల పాఠశాలల్లో ఉంటే సీఎంకు చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు హరీష్‌. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి దిగజార్చారని మండిపడ్డారు. ప్రభుత్వం మీద నమ్మకంతో గురుకులాల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. 


గురుకుల విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే వారి బాధ చూసి తట్టుకోలేక తెలుసుకునేందుకు తాము వచ్చామన్నారు హరీష్‌. వచ్చిన తర్వాత పిల్లలు తమ దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారని భయంతో వణికిపోతున్నారని తెలిపారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని వాపోయారు. అన్నంలో, పప్పులో పురుగులు ఉంటే తింటే తినండి లేకుంటే మానేయండీ అంటూ సిబ్బంది రుబాబు చేస్తున్నారని విద్యార్థులు తెలియజేసినట్టు వివరించారు. 
ఇప్పటి వరకు గురుకుల విద్యార్థులకు ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని తెలిపారు హరీష్‌. రెండో జత బట్టలు, పుస్తకాలు కూడా ఇవ్వలేదని ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నప్పుడు సన్నబియ్యంతో అన్నం పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం గొడ్డు కారంతో పెడుతున్నారని మండిపడ్డారు. గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 


పాఠశాలలో తరగతి గదులు ఊడ్చేపని నుంచి వంట వరకు అన్ని పనులు తమతో చేయిస్తున్నారని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫుడ్ మాత్రం సరిగా పెట్టడం లేదని వాపోయారు. ఇలాంటివి ఎవరికైనా చెబితే కర్రలు విరిగేలా కొడుతుంటారని ఈ టీచర్స్ మాకు వద్దని పిల్లలంతా బోరుమన్నారు. వారిని హరీష్‌, సబితా ఇంద్రారెడ్డి బోదరించి ధైర్యం చెప్పారు. వాళ్లకు ఇద్దరి ఫోన్ నెంబర్లు విద్యార్థులకు ఇచ్చారు. ఎవరైనా ఇబ్బంది పెడితే ఫోన్ చేయాలని భరోసా ఇచ్చారు. 






ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే 500 మంది పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారని... 38 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్‌. పాములు కరిచి, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని, మైనార్టీ గురుకులాలు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అన్ని గురుకులాల్లో కాస్మొటిక్ చార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదన్నారు.