తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మె్ల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించాక, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌కి రెండవ సారి అధికారం కట్టపెట్టిన తరువాత అహంకారం పెరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీనీ మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ గౌరవ, మర్యాదలు లేకుండా చేశారు. పనికిమాలిన సభలాగ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేస్తున్నారు. పోయినా సమావేశాల్లో మమ్ముల్ని అకారణంగా బయటికి పంపించారు.’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్రంలో VRA, VRO లు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నెలకొన్నాయి. గెస్ట్ లెక్చరర్స్ బతుకులు దుర్భరంగా మారాయి. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. మా సమస్యలు పరిష్కరించాలని అనేకమంది మాకు రెప్రసెంటేషన్స్ ఇచ్చారు. వాటిని చర్చించేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. కానీ 6, 12, 13 తేదీల్లో మాత్రమే సమావేశాలు ఉంటాయి అని నోటీస్ పంపించారు. శాసన సభ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. ప్రభుత్వం తేదీలు ప్రతిపాదిస్తే బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కానీ కేసీఆరే అన్నీ నిర్ణయిస్తారు. అది అహంకారం నియంతృత్వానికి నిదర్శనం. ముందు ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం.’’ అని ఈటల అన్నారు.
బీజేపీ వల్లే తలొగ్గిన కేసీఆర్ - ఈటల
‘‘స్వయంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు తెలంగాణ జాతి స్వాతంత్ర వేడుకలు జరుపుకొలేని దుస్థితిలో ఉందని అన్నారు. ఒడ్డు ఎక్కాక బోడ మల్లన్న అన్నట్టు వ్యవహరించారు. అధికారం వచ్చాక అన్నీ మర్చిపోయారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవం కోసం బీజేపీ తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తుంది. తల ఒగ్గిన కేసీఆర్ తప్పని పరిస్థితుల్లో ఈ ఉత్సవాలు చేస్తున్నారు.
ఇది ప్రజల మీద ప్రేమ కాదు. ఇప్పటికైనా జరుపుతున్నాడు సంతోషం’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
‘‘సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం అయ్యింది. ఆపరేషన్ పోలో పేరిట విలీనం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం పెరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవాలు నిర్వహిస్తాం అని చెప్పిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేసీఆర్ మెడలు వంచిన ఘనత బీజేపీది’’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
బీఏసీకి పిలవకపోవడంపై అసహనం
అసెంబ్లీలో రూల్స్ ఎంత ముఖ్యమో సంప్రదాయాలు కూడా అంతే ముఖ్యం అని ఈటల రాజేందర్ అన్నారు. ద్వేష పూరిత రాజకీయాలకు పరాకాష్టగా అసెంబ్లీనే మార్చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశానికి పిలవకపోవడంపై ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా తాను అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. పార్టీ తరపున ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీని పిలిచే సంప్రదాయం ఉందని అన్నారు. అలాంటిది, 4 పార్లమెంట్, 3 శాసన సభ్యులు ఉన్న పార్టీ అలాంటి పార్టీ సభ్యులను బిజినెస్ అడ్వైసరీ కమిటీ మీటింగ్ కి పిలవకపోడం ద్వేష పూరిత రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
‘‘మీకు ఇదే గతి పడుతుందని మర్చిపోకండి. పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు. సభ ఎప్పటికీ ఉంటుంది. స్పీకర్.. మరమినిషి లెక్క కాకుండా సభ్యుల హక్కులు కాపాడాలి’’ అని ఈటల రాజేందర్ విమర్శించారు.