హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరపాలంటూ నెక్లెస్ రోడ్‌లో గణేష్ ఉత్సవ సమితి చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఉత్సవ నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావుతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు సహా సభ్యులను అరెస్టు చేశారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ట్వీట్ చేసింది. తాము తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చి, సాగర పరిక్రమ చేయబోతుండగా అరెస్టు చేశారని ఆరోపించారు.
నిన్న ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరిక
నిమజ్జనాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ.. హుసేన్ సాగర్ చుట్టూ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు బైక్ ర్యాలీ తలపెట్టిన సంగతి తెలిసిందే. వారిని ర్యాలీకి ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం కూడా గత ఏడాది మాదిరిగా నిమజ్జనం నిర్వహిస్తామని చెప్పింది. పాండ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. అవి ఎన్ని చేశారో తెలియడం లేదు. భక్తులను పాండ్స్ దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు. గణేష్ విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారు. ఎటువంటి అపశృతి లేకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిమజ్జనానికి ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేయాలి.
పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. బాలాపూర్ గణేష్ సమితికి కూడా అదే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అటువంటి చర్యలు మానుకోవాలి. బతుకమ్మ, క్రిస్ మస్, రంజాన్, మోహర్రం పండుగల మీద ఉన్న ఆసక్తి గణేష్ ఉత్సవాలపై లేదు. సత్యవతి సిన్హా 2001లో ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా వినాయకులను సాగర్ లో నిమజ్జనం చేయొద్దని చెప్పలేదు.
నిమజ్జనం జరిగిన 24 గంటల్లోనే విగ్రహాల వ్యర్థాలను తొలగిస్తున్నాం. దాంతో కాలుష్యం జరగడం లేదు. నిమజ్జనంతో ఎలాంటి అపశృతి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తమిళనాడు జల్లికట్టు అంశంలో కోర్ట్ లో కేసు ఉన్నా.. ఏవిధంగా చర్యలు తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిమజ్జనాలకు అదే విధమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గణేష్ ఉత్సవాలకు ముందే చర్యలు తీసుకోవాలి
గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేయాలని రేపు నెక్లెస్ రోడ్ లో బైక్ ర్యాలీ నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నారు. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేకుంటే.. ఎక్కడి విగ్రహాలు అక్కడ పెట్టి నిరసన చేస్తాం’’ అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు సోమవారం (సెప్టెంబరు 5) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హెచ్చరించారు.
నిమజ్జనం ఈనెల 9నే
ఈ నెల 9వ తేదీన గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది. అనంత చతుర్దశి కాబట్టి శుక్రవారమే నిమజ్జనం చేయాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. కొంతమంది, పోలీసులు 9వ తేదీ నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంకా కొంతమంది వాటిని వాట్సాప్ లో విపరీత ప్రచారం చేస్తున్నారని అన్నారు.