Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు జీఐఎస్‌ సర్వే నిర్వహిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సేవల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ సర్వే ఉపయోపడుతుందని అన్నారు. సర్వే చేస్తున్నారని తెలిసి ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేందుకు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సర్వే అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, యుటిలిటీస్‌ జియో  ఫెన్సింగ్ అవుతాయన్నారు. 


సర్వే కోసం ఇంటికి వచ్చే సిబ్బంది వ్యక్తిగత సమాచారం అడగబోరని అన్నారు అమ్రపాలి. ఆధార్‌, పాన్ కార్డ్‌ వివరాలు తెలుసుకోరని పేర్కొన్నారు. విద్యుత్, నల్లా బిల్లులు ఇవ్వాల వద్దా అనేది ఎవరి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టారని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి అయిందన్నారు. 


జీఐఎస్‌ సర్వే ఇప్పటి వరకు హైదరాబాద్‌లో జరగలేదని అలా జరిగితే స్టార్టప్ కంపెనీలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు అమ్రపాలి. శాటిలైట్, డ్రోన్, ఇంటింటి పర్యటనతో తీసుకున్న వివరాల ఆధారంగా జరిగే మ్యాపింగ్‌తో జరిగే ప్రయోజనాలు భవిష్యత్‌లో ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. కబ్జా అనే మాట లేకుండా చేయొచ్చని తెలిపారు.  


జీఐఎస్‌ సర్వేతో ఇంటింటికీ ఓ డిజిటల్‌ అడ్రెస్‌ ఐడీ ఇస్తారని దాని ఆధారంగానే ఇకపై సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ ఐడీని ప్రతి ఇంటికి అతికిస్తారని తెలిపారు. సర్టిఫికేట్లు ఇతర డాక్యుమెంట్లు ఈ ఐడీ ఆధారంగానే నేరుగా ఇంటికి వచ్చే వెసులుబాటు ఉందన్నారు. అత్యవసర సేవలు కూడా వేగంగా అందుకోవచ్చని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల్లో జరిగే అలసత్వాన్ని కట్టడి చేయొచ్చన్నారు.  


చెత్త సేకరించే వాళ్లు తమ ఇంటికే కొన్ని సార్లు రావడం లేదని దాని వల్ల ఇబ్బంది పడుతున్నామని అన్నారు అమ్రపాలి. ఇక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ఉన్నాయని... ఇకపై చెత్త సేకరించిన ఇంటి నెంబర్‌ ఫోన్లో అప్‌లోడ్ చేస్తే ఆ ఇంటి నుంచి చెత్త తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవుతుందని తెలిపారు. అలా హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారు. ఎంత సిబ్బంది కావాల్సి ఉంటుందనే తెలుస్తుందన్నారు. 


ఈ సర్వేపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కేవలం భవనాల వివరాలు, పీటీఐఎన్‌ వివరాలు మాత్రమే తెలుసుకుంటారని పేర్కొన్నారు. అంతుకు మించిన వివరాలు అడగబోరని అన్నారు. ప్రజలు చెప్పే వివరాలు జీహెచ్‌ఎంసీకి మాత్రమే తెలుస్తాయని వేరే వ్యక్తులకు తెలిసే ఛాన్స్ లేదన్నారు. గోప్యత పాటిస్తామని వివరించారు. పొరపాటున తప్పుడు సమాచారం ఇచ్చినా తర్వాత సరిచేసుకునే వీలు కూడా ఇస్తామన్నారు. ఓనర్‌షిప్ వివరాలు పట్టించుకోబోమని తెలిపారు. 


సర్వే చేసే సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్న భవనాలు సొంత భవనాలా, ప్రభుత్వ భవనాలా, వాణిజ్య భవనాలా, అపార్టమెంటా, గ్రూప్‌ హౌసింగ్, లేకా ప్రార్థనా మందిరమా, ఖాళీ స్థలాలు ఎవరిది అనేది తెలుసుకోనున్నారు.  ఈ సర్వే కాస్ట్‌ రూ. 22 కోట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 158 కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వే పూర్తైనట్టు తెలిపారు. 1,14,020 ఇళ్ల డిజిటలైజేషన్ జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదర్‌ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్ బీకాలనీ, ఉప్పల్, హయత్‌నగర్‌లో సర్వే నడుస్తోందన్నారు.