TGSRTC News: హైదరాబాద్‌లో ఓ వింత ఘటన జరిగింది. దీని గురించి విని అంతా ఆశ్చర్యపోతున్నారు. సిటీలోని నల్లకుంట విద్యానగర్‌లో ఓ పెద్దావిడ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై పామును విసిరింది. చెయ్యి ఎత్తినా కూడా ఆర్టీసీ బస్సును ఆపకపోవడంతో వృద్ధురాలు తీవ్ర ఆగ్రహంతో ఈ పని చేసింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ వద్ద మద్యం మత్తులో వృద్ధురాలు ఇలా చేసిందని అంటున్నారు. 


ఆర్టీసీ సిటీ బస్సును ఆమె ఆపే ప్రయత్నం చేయగా.. డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లాడు. దీంతో ఆమె ఆగ్రహం పట్టలేక తన వద్ద ఉన్న బీర్ బాటిల్‌తో ఆమె బస్సుపైకి విసిరింది. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం మొత్తం పగిలిపోయింది. అది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపాడు. బీర్ బాటిల్‌తో కొట్టిన ఆ వృద్ధురాలిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె చేసిన పనిని అందరూ వణికిపోయారు.


డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహానికి గురైన వృద్ధురాలు తన వద్ద ఉన్న పాముని బస్సు డ్రైవర్‌పై విసిరింది. భయభ్రాంతులకు గురైన బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. స్థానికులు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా డ్రైవర్‌ పైకి పాము విసిరిన పెద్దావిడ బ్యాగులో మరో 2 పాములు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


స్పందించిన టీజీఎస్ఆర్టీసీ


‘‘దిల్‌సుఖ్‌నగర్‌ డిపోనకు చెందిన 107V/L రూట్‌ నంబర్‌ గల #TGSRTC బస్సు గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపునకు వెళ్తోంది. విద్యానగర్‌ బస్టాఫ్‌ తర్వాత సిగ్నల్‌ ఫ్రీ లెఫ్ట్‌ వద్ద బస్సు తిరుగుతున్నప్పుడు ఒక మహిళా బీర్‌ బాటిల్‌తో బస్సుపై దాడి చేసింది. ఈ ఘటనలో బస్సు వెనకభాగంలో ఉన్న అద్ధం పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపారు. విధులు నిర్వహిస్తోన్న మహిళా కండక్టర్‌ కిందకు దిగి ఆమెను పట్టుకున్నారు. బస్సుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు. ఆ సమయంలో ఒక్కసారిగా తన సంచిలో ఉన్న పామును తీసి కండక్టర్‌పై ఆమె విసిరేసింది.


కండక్టర్‌ తన చేతులను అడ్డుగా పెట్టడంతో పాము కింద పడింది. ఈ ఘటనపై హైదరాబాద్‌ కమిషనరేట్‌ నల్లకుంట పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యానగర్‌ బస్టాప్‌లో బస్సు ఆపకపోవడం వల్లే దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదు. విద్యానగర్‌ సిగ్నల్‌ ఫ్రీలెప్ట్‌ వద్ద ఆర్టీసీ బస్టాప్‌ లేదు. ఫ్రీ లెప్ట్‌కు ముందు, తర్వాత రెండు బస్టాప్‌లున్నాయి. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న బస్సులపై దాడులు చేయడం, నిబద్దత, అకింతభావంతో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిని కొందరు ఇలా భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరం. ఈ తరహా ఘటనలను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. పోలీస్‌ శాఖ సహకారంతో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది’’ అని టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.