Disha Case: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగి నేటికి మూడేళ్లు పూర్తి అయింది. ఎన్ కౌంటర్పై సుప్రీం కోర్టు నియమించిన కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కమిషన్ పేర్కొన్న విధంగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న వారిపై కూడా కేసు నమోదు చేయాలని పిటిషనర్స్ కోరారు. 10మంది అధికారులపై సెక్షన్ 302, 201, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అన్నారు. ఇప్పటికే ఈ కేసులో అమికస్ క్యూరీ (Amicus Curiae)గా దేశాయ్ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించడం తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణను వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఏడు నెలల కిందటే సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఓ కట్టుకథలా ఉందని ఏడు నెలల కిందట సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చేసింది. మరి ఎన్కౌంటర్ గురించి పోలీసులు చెప్పింది కట్టుకథ అయితే.. అసలు నిజం ఏంటనే వాదనలు వినిపించాయి. పోలీసుల వాంగ్మూలంలో తప్పులున్నాయని చెప్పిన కమిషన్.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడంలో విఫలం అయిందని పోలీసుల తరఫు వాదించిన న్యాయవాది కోట కీర్తి కిరణ్ అన్నారు. మూడేళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య అప్పట్లో కలకలం రేపింది. అయితే ఆ తర్వాత వారం రోజులకే ఆ హత్యాచారం కేసులో నిందితులకు సంబంధించిన ఎన్ కౌంటర్ కూడా అంతే సంచలనంగా మారింది. అయితే, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసులు చెబుతున్న విషయాలు ఏవీ నమ్మదగ్గేవిగా లేవని దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సిర్పూర్కూర్ కమిషన్ పేర్కొంది.
ఈ ఘటనతో సంబంధం ఉన్న 10 మంది పోలీసులపై హత్య కేసులు నమోదు చేయాలని కూడా నివేదికలో పొందుపరిచారు. జరిగిన ఘటనపై నిజ నిర్దారణ చేయడానికి ఏర్పాటైన విచారణ కమిషన్- "నిజాన్ని" కనుక్కోవడంలో మాత్రం విఫలం అయిందని అన్నారు. పోలీసులు చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నాయని భావించినప్పుడు, జరిగిన నిజం ఏంటో కూడా వాళ్లు చెప్పాల్సి ఉందన్నారు. ఏబీపీ దేశంతో మాట్లాడిన ఆయన... "సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే.. కేసును హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసి ఈ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకోర్టుకు అప్పగించింది.
వాస్తవంగా ఏం జరిగిందో కూడా చెప్పాలి కదా..!
ఇంకో విషయం ఏంటంటే.. సిర్పూర్కర్ కమిషన్ నిజనిర్థారణ కోసం ఏర్పడింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో పోలీసులు చెప్పిన విషయాల్లో లోపాలు ఉన్నాయని చెప్పారే తప్ప.. వాస్తవంగా ఏం జరిగిందన్నది రిపోర్టులో చెప్పలేదు. పోలీసు వెర్షన్ లో లోపాలు అంటున్నారు కానీ.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పాలి కదా.." అంటున్నారు. ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం పోలీసుల తీరును తప్పుపడతూ.. వారిని ప్రాసిక్యూట్ చేయాలని సూచించడం దేనికి సూచిక అని ప్రశ్నించినప్పుడు.. "లీగల్ గా రిపోర్టును కోర్టులో టెస్టు చేసేవరకూ.. నివేదికకు వాలిడిటీ ఉండదు. ఇప్పటి వరకూ అది జరగలేదు. రేపు హైకోర్టులో రిపోర్టుపై విచారణ జరిగి కోర్టు నిర్ణయం తీసుకునే వరకూ న్యాయపరమైన విలువ ఉండదు. " అన్నారు.