తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కదిద్దడానికి ఢిల్లీ నుంచి వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం నేడు (డిసెంబర్ 22) ఉదయం ఆయన గాంధీ భవన్ కు వచ్చి కాంగ్రెస్ సీనియర్ నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు. పీసీసీ వ్యతిరేకవర్గ నేతలతోపాటు, రేవంత్ అనుకూల నేతలతోనూ మాట్లాడుతున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు పార్టీ నేతలతోనే మాట్లాడతారని తెలుస్తోంది. చర్చల తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, నేతల మధ్య విభేదాలకు కారణాలపై అధిష్ఠానానికి రిపోర్టు ఇవ్వనున్నారు. దిగ్విజయ్ సింగ్ కు ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. 


సీనియర్ నేతలు వీ.హనుమంతరావు, మల్లు రవి, శ్రీధర్‌బాబు, మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తదితర నేతలు గాంధీ భవన్‌కు చేరుకున్నారు. వీహెచ్ దిగ్విజయ్ ను కలిసి అనంతరం మాట్లాడారు. దిగ్విజయ్ రాకతో కాంగ్రెస్‌లో సంక్షోభం ముగిసి, పార్టీ బలపడుతుందని ఆశిస్తున్నట్లుగా వీహెచ్ చెప్పారు. పార్టీలో తాజా పరిణామాలు, సీనియర్ నేతల మధ్య విభేదాలు, తన గురించి జరిగిన దుష్ర్పచారం, తనకు జరిగిన అవమానాలను దిగ్విజయ్ కు వివరించానని వీహెచ్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత అందులో ఘోర ఓటమి గురించి ఒక్క సమీక్షా సమావేశం కూడా జరగలేదనే విషయాన్ని కూడా 


దిగ్విజయ్ సింగ్‌‌‌‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కలిశారు. ఆ భేటీపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. దిగ్విజయ్ సింగ్‌కు తాను బాగా తెలుసని అన్నారు. ఆయనను మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశానని చెప్పారు. రాజకీయాలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్‌ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పంపారని, ఆయనతో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని తాను అనుకుంటున్నానని అన్నారు. దిగ్విజయ్ సింగ్ విధానం వేరని, సీనియర్స్ కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు.


నిన్ననే కలిసిన కోమటిరెడ్డి


దిగ్విజయ్‌ సింగ్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కలిశారు. నిన్న (డిసెంబరు 21) హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌తో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ట హోటల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు ఆయనను కలిశారు. ఇవాళ గాంధీభవన్‌లో జరిగే సమావేశానికి అందుబాటులో ఉండడం లేదని అందుకే ఆయన్ను ముందుగానే కలిసినట్లుగా కోమటిరెడ్డి నిన్న చెప్పారు. 2018 తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు గత 20 నెలలుగా పార్టీ పరిస్థితులపై దిగ్విజయ్‌ సింగ్‌తో మాట్లాడానని చెప్పారు.


మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, సురేష్‌ షట్కర్‌, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్‌ తదితర నేతలు దిగ్విజయ్‌ సింగ్‌ను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను వివరించారు. ఈ చర్చల తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌తో కూడా మాట్లాడి అధిష్ఠానానికి ఇచ్చే నివేదిక సిద్ధం చేయనున్నారు. సాయంత్రం అనుబంధ సంఘాల నేతలతోనూ దిగ్విజయ్‌ సింగ్‌ సమావేశం అవుతారు.