తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసుక్రీస్తు వల్లే కరోనా మహమ్మారి తగ్గిపోయిందని, డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల కాదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తెలంగాణ విభాగం తీవ్రంగా ఖండించింది. ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇంత దిగజారి మాట్లాడడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మత విభేదాలను ప్రేరేపించేలా, కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసేలా, హిందువులను కించపరిచేలా మాట్లాడటం కరెక్టు కాదని ఆక్షేపించింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. 


జి.శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు హిందుత్వాన్ని, వైద్య విధానాలను, సైన్స్‌ను, శాస్త్రవేత్తలను కించపరిచే విధంగా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ జాతికి ఏసుక్రీస్తు మాత్రమే దైవమని మిగతా దేవుళ్ళందరూ ఉత్తిదే అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం నేరం కాదా? అని ప్రశ్నించింది. గతంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో క్షుద్ర పూజలు నిర్వహించి శ్రీనివాస్ వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు గుర్తు చేశారు. 


ఏసుక్రీస్తు వల్లే దేశం అభివృద్ధి సాధించిందని ఆయన మాట్లాడటంలో అసలు అర్థం ఉందా? అని నిలదీశారు. అసలు ఏసుక్రీస్తుకి, దేశ అభివృద్ధికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. లక్షల మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తే గాని కరోనా అదుపులోకి రాలేదని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇదంతా ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనం అని ఆక్షేపించారు. జి.శ్రీనివాసరావు తమ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులను హిందువుల, క్రైస్తవులుగా విభజించారని, క్రైస్తవులకు మేలు కలిగే విధంగా శ్రీనివాస్ మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ విమర్శించింది. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని విశ్వహిందూ పరిషత్ తప్పుపట్టింది. వెంటనే శ్రీనివాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి హెచ్చరించారు.


హెల్త్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇవీ


తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు సెమీ క్రిస్మస్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో డీఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు బుధవారం (డిసెంబరు 21) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని, మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఆధునిక సంస్కృతి కానీ.. మన దేశానికి కానీ.. మన రాష్ట్రానికి కానీ..అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే వారధులని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. లేదంటే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేదని అన్నారు. 


క్రైస్తవం లేకపోతే ప్రపంచంలో భారత దేశం ఇంత అభివృద్ది చెంది ఉండేది కాదని గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఆ రోజు ఎవరైతే ఆధునిక విద్యను, ఆధునిక వైద్యాన్ని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో. వారి వల్లే మనం అభివృద్ధి చెందాం. మన దేశాన్ని అన్ని దేశాల కంటే ముందుండేలా చేసిందన్నారు. యేసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలని పిలుపునిచ్చారు.  ఇంతకు ముందు జరుపుకున్న క్రిస్మస్‌లు వేరు. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్‌లు వేరని..   గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళికి ప్రశ్నార్థకంగా కొవిడ్ మారిందన్నారు.  దాన్నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యామన్నారు.  అది మనం చేసిన సేవల వల్ల కాదు. యేసు క్రీస్తు కృప, యేసు క్రీస్తు దైవం యెుక్క దయ ప్రభావం అని స్పష్టం చేశారు.