ఈ మధ్య కాలంలో వర్క్‌ఫ్రమ్‌ ఎక్కువైంది. ఎక్కువ సంపాదించాలనే కోరికతో ప్రజలు విపరీతంగా ఆన్‌లైన్ పనుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇదే సైబర్‌ నేరగాళ్లకు మంచి సంపాదనగా మారింది. ప్రజలకు పని దొరకడం ఏమో గానీ... సైబర్ నేరగాళ్లకు మాత్రం చెమట చుక్క రాకుండానే కోట్లు వచ్చి పడుతున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 
ముషీరాబాద్‌లోని ఆజామాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఆన్‌లైన్ ట్రేడింగ్‌ చేయాలని ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశాడు. ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి తగిలాడు. తాను కొన్నేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నానని.. చాట్ చేసి నమ్మకంగా వివరాలు చెప్పాడు. తక్కువ పెట్టుబడితోనే తాను భారీగా సంపాదించానంటూ కలరింగ్ ఇచ్చాడు. ఇదంతా నమ్మేసిన ఆ వ్యాపారి ఆయన చెప్పినట్టు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యాడు. అంతే ఆ సైబర్‌ నేరగాడు.. వ్యాపారి  వాట్సాప్‌కు  ఎస్‌క్యూ.కామ్‌ అనే యాప్‌కు సంబంధించిన లింక్‌ పంపించాడు. 


పెట్టిన పెట్టుబడి రెండింతలు మూడింతలు అవుతుందని నమ్మిన వ్యాపారి ఎక్కడో అపనమ్మకంతోనే ఆ ముసుగు వ్యక్తి పంపించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ముందుగా రెండు వేలు పెట్టుబడి పెట్టాడు. సాయంత్రానికి నాలుగు వేలు తన అకౌంట్‌లో పడ్డాయి. వ్యాపారికి నమ్మకం కుదిరింది. రెండో ప్రయత్నంగా లక్ష రూపాయలు పెట్టబడి పెట్టాడు. సాయంత్రానికి 2.62 లక్షలు అకౌంట్‌లో పడ్డాయి. ఇంకాస్త నమ్మకం కలిగింది. 


వ్యాపారి మెదడులోని ఆలోచనలు ముందే పసిగట్టిన ఆ సైబర్‌ నేరగాడు మరింతగా రెచ్చగొట్టాడు. ఎంత పెట్టుబడి పెడితే అంతకు మించి వస్తుందని ఎంకరేజ్‌ చేశాడు. అంతే వ్యాపారి టెంప్ట్‌ అయ్యాడు. ఈసారి 21 లక్షలు పెట్టాడు. సాయంత్రానికి 50 లక్షలు అయ్యాయి. కానీ అక్కడే సైబర్‌ నేరగాడు ట్విస్ట్ ఇచ్చాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి పంపించిన యాప్‌లో 50 లక్షలు కనిపిస్తున్నాయి కానీ... ముందు చేసినట్టు నేరుగా వ్యాపారి తన అకౌంట్‌కు మార్చుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా యాప్‌ రియాక్ట్ కాలేదు. ఏం జరిగిందే తెలుసుకునేందుకు యాప్‌ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేశాడు. కానీ ఆ ఫోన్‌ నెంబర్ సడెన్‌గా స్విచ్ఛాఫ్‌. అంతే వ్యాపారి షాక్. ఇంతలో ఆ సైబర్‌ నేరగాడు ఇచ్చిన యాప్‌ కూడా కనిపించకుండా పోయింది. షాక్‌ మీద షాక్ తిన్న వ్యాపారి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. న్యాయం చేయాలని తన 21 లక్షలు ఇప్పించాలని వేడుకున్నాడు. 
ఆజామాబాద్‌కు చెందిన వ్యాపారినే కాదు.. యూసఫ్‌గూడ, బండ్లగూడకు చెందిన ఇద్దరు మహిళలను కూడా మోసం చేశారీ సైబర్‌ నేరగాళ్లు. రకరకాల పేర్లతో యాప్‌లను తీసుకొచ్చి భారీగా పెట్టుబడి పెట్టించి మాయమయ్యారు. వీళ్లందరి వద్ద ఒకటే స్టైల్‌లో కొట్టేశారు. ముందుగా చిన్న చిన్న అమౌంట్‌ డబుల్ అయిందని ఇవ్వడం... తర్వాత వాళ్లు నమ్మకంతో పెట్టుబడి పెట్టాక సైలెంట్‌గా జారుకోవడం. 


Also Read: ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య... పురుగుల మందు తాగి ప్రయాణం... సిబ్బంది స్పందించినా నిలవని ప్రాణాలు


Also Read:  ఏపీ సహా దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. బాలలపై కన్నేసిన మృగాళ్లే టార్గెట్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి