ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబరు 18 నాటికి దక్షిణ కోస్తా - ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉంది. కోస్తాంధ్ర-తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి మరింత బలపడే అవకాశముంది. అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 18, 19 తేదీల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల రాదని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది.
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఈ నెల 18 వరకు ఆంధ్రప్రదేశ్-తమిళనాడు తీరం వద్ద నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి కారణంగా.. రాష్ట్రంలో బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.