హైదరాబాద్ లో గ్రూప్ - 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ప్రవళిక మృతి అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఉద్యోగాలు రాకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యువతి బలవన్మరణానికి పాల్పడిందంటూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై రాజకీయంగానూ వివాదం నెలకొంటోంది. తాజాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై సంచలన ట్వీట్ చేశారు.


'ఆత్మహత్య కాదు హత్య'


గ్రూప్ - 2 అభ్యర్థిని ప్రవళికది ఆత్మహత్య కాదని హత్యే అని ఆయన ట్వీట్ చేశారు. 'శుక్రవారం హైదరాబాద్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరం. ఇది ఆత్మహత్య కాదు హత్య. తెలంగాణ యువత నేడు నిరుద్యోగంతో పూర్తిగా విలవిల్లాడుతోంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయి.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.






'2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'


తాము అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలోనే టీఎస్ పీఎస్సీని బలోపేతం చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.


స్పందించిన గవర్నర్


కాగా, ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ, TSPSC కార్యదర్శిని ఆదేశించారు. నిరుద్యోగులు సహనం కోల్పోవద్దని తమిళిసై అన్నారు.


ఇదీ జరిగింది


వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ గ్రూప్ - 2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వందలాది నిరుద్యోగ అభ్యర్థులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. గ్రూప్ - 2 పరీక్ష వాయిదా పడడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తూ నిరసనలు తెలిపారు. వారికి బీజేపీ నేతలు సైతం మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత పోలీసులు మృతదేహాన్ని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.


స్వగ్రామానికి తరలింపు


పోస్టుమార్టం పూర్తైన అనంతరం ప్రవళిక మృతదేహాన్ని అక్కడి నుంచి శనివారం ఉదయం ఆమె స్వగ్రామానికి తరలించారు. ప్రవళిక మృతితో ఆమె స్వగ్రామం బిక్కాజిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.