Let's Metro For CBN: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీలోనే కాదు హైదరాబాద్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ర్యాలీ, ధర్నాలు చేసిన టీడీపీ  కార్యకర్తలు.. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా నల్ల టీషర్టులు ధరించి మెట్రో ట్రైన్‌లో ప్రయాణించారు. దీంతో  హైదరాబాద్‌ మెట్రో స్టేషన్ల దగ్గర హైఅలర్ట్‌ కొనసాగుతోంది.


లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌ పేరుతో చేపట్టే ఆందోళనకు మద్ధతుగా భారీగా టీడీపీ శ్రేణులు మద్దతుదారులు రావడంతో హైదరాబాద్‌లోని చాలా మెట్రో స్టేషన్‌లలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా మియాపూర్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులే ఏర్పాడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ను కాసేపు మూసివేశారు పోలీసులు. మిగిలిన అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మెట్రో స్టేషన్ల లోపలికి పంపుతున్నారు.






ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు  పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా.. ఉదయం మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు మద్దతుదారుల ఆందోళనతో.. హైదరబాద్‌ మెట్రోస్టేషన్ల దగ్గర  హైఅలర్ట్‌ కనిపించింది. అన్ని స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు పోలీసులు. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. 




స్కిల్‌ స్కామ్‌ చంద్రబాబును సెప్టెంబర్‌ 9న అరెస్ట్‌ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీలో  ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా అప్పుడప్పుడు ఆందోళనలు నిర్వహించారు చంద్రబాబు మద్దతుదారులు. ఇటీవల  మోత్కుపల్లి కూడా దీక్ష చేపట్టారు. ఇప్పుడు... ఒక్కసారిగా మెట్రో స్టేషన్లలో నిరసన చేపట్డంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్‌ టీషర్ట్‌ ధరించి వస్తున్న ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.