Rahul Tweet About Telangana New: తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ వేశారు. తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు రాహుల్. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజాసర్కార్ ఏర్పాటు చేస్తామని అన్నారు రాహుల్. రేవంత్ రెడ్డితో ఉన్న ఫొటోలను రాహుల్ తన ట్వీట్ కి జతచేశారు. 






 


ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఉదయాన్నే ఆయన మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని కలిశారు. అనంతరం సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడ సోనియా, రాహుల్, ప్రియాంకను కలసి ధన్యవాదాలు తెలిపారు. తనకు సీఎంగా అవకాశమిచ్చినందుకు అగ్రనేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి.  వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ లో రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని వారిని ఆహ్వానించారు. 


మంత్రి వర్గంపై మంతనాలు..
ఢిల్లీ పర్యటనలోనే తెలంగాణ మంత్రి వర్గంపై కూడా రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. అధినాయకత్వంతో చర్చలు జరిపి ఆయన తెలంగాణ మంత్రి వర్గం జాబితాపై ఆమోద ముద్ర వేయించుకోబోతున్నారు. రేవంత్ వర్గంతోపాటు.. రేవంత్ ని వ్యతిరేకిస్తున్న సీనియర్ వర్గానికి కూడా మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించే అవకాశముంది. డిప్యూటీసీఎంల దగ్గరే పీటముడి పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీలు ఇద్దరు ఉంటారా, లేక ఒకరితోనే(భట్టి విక్రమార్క) సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది. మంత్రి వర్గ జాబితా కూడా ఫైనల్ అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరతారు. 


రేపు ప్రమాణ స్వీకారం.. 
రేవంత్ రెడ్డి రేపు తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపే మంత్రి వర్గం కూడా కొలువుదీరే అవకాశముంది. దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి కసరత్తులు పూర్తి చేస్తారు. సీఎంతోపాటు మంత్రి వర్గం కూడా కొలువుదీరితే.. ఆరు గ్యారెంటీల వ్యవహారం కూడా ఓ కొలిక్కి వస్తుంది. ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కృతజ్ఞత సభలోనే ఆరు గ్యారెంటీలపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆరు గ్యారెంటీలను యథాతథంగా అమలు చేస్తారా లేక అందులో ఏమైనా మెలికలు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలన్నీ అలాగే అమలు చేయాలంటే బడ్జెట్ కేటాయింపుల్లో సమతూకం ఉండాలి. ఆ దిశగా రేవంత్ రెడ్డి కసరత్తులు చేయాలి, మిగతా విభాగాలకు కేటాయింపులు తగ్గించాల్సి ఉంటుంది. ఎలా చూసినా ఇది కత్తిమీద సాము అని చెప్పాలి. 


హైదరాబాద్ కు రాహుల్..
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వస్తారని తెలుస్తోంది. ఖర్గే, డీకే.. కూడా ఈ కార్యక్రమానికి వస్తారని అంటున్నారు. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పాలన మొదలవుతున్న సందర్భంలో.. విజయోత్సవాలను అగ్రనేతలు సెలబ్రేట్ చేసుకుంటారు. అందులోనూ.. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ కేవలం తెలంగాణలో మాత్రమే పరువు దక్కించుకుంది. దీంతో ఈ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. మొత్తమ్మీద సీఎం ఎంపిక సాఫీగా పూర్తవడం, ఎలాంటి అసంతృప్తికి అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం హడావిడి లేకుండా ఉంది.