తెలంగాణ సీఎం ఎవరూ అనే సస్పెన్స్ వీడింది. రేవంత్‌ను కన్ఫామ్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం మిగతా వారికి కూడా భరోసా ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది వరకు చోటు దక్కనుంది. అయితే మంత్రి వర్గంలో స్థానం కోసం 30 మందికిపైగా నేతలు పోటీ పడుతున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో ఉంటూ రాజకీయాలు చేస్తున్న వారే ఎక్కువ. వారిలో ఎవరెవరికి స్థానం లభిస్తోందో అన్న లెక్కలు వేసుకుంటున్నారు. 


నల్గొండ నుంచి కోమటి రెడ్డి బ్రదర్స్‌తోపాటు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి రేసులో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా మల్లు భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్గం కూడా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా దామోదర్ రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, షబ్బీర్ అలీ సుమారు 30 మందికిపైగా నేతలు మంత్రులు అవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నారు. 


సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసిన తర్వాత ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం ఈ జట్టుపైనే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించని వారిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. వారికి ఎలాంటి శాఖలు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఉత్తమ్ లాంట వాళ్లు తాము కూడా సీఎం రేస్‌లో ఉన్నామని బహిరంగంగానే చెప్పేశారు. మరి వాళ్ల ఇచ్చే పదవులు ఎలా ఉంటాయో చూడాలి. 


ఓడిపోయిన నేతలు కూడా కొందరు మంత్రులు కావాలని తహతహలాడుతున్నారు. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ఓడిపోయినప్పటికీ మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ పటిష్టానికి శ్రమించారు. వాళ్లను కూడా సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉంటుంది. వారిని ఎలా సంతృప్తి పరుస్తారో చూడాలి. 


ఎన్నికల సందర్భంగా కొందరు నేతలకు కూడా మంత్రి పదవిపై కాంగ్రెస్ అధినాయకత్వం హామీ ఇచ్చింది. వారిని కూడా ఈసారి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వారి విషయంలో ఎలా ముందుకెళ్తారనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎంలు ఎన్ని ఉండాలనే చర్చ కూడా సాగుతోంది. మల్లుభట్టివిక్రమార్క లాంటి వాళ్లు ఒకటే ఉండాలని పట్టుబడుతున్నారు 
 
వీటన్నింటిపై ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి 10 గంటలకు డీకే శివకుమార్, మాణిక్కం ఠాగూర్‌తో  భేటీ అయ్యారు. ఇవాళ మరికొందరితో సమావేశం కానున్నారు. తనకు సీఎం పదవి కట్టబెట్టినందుకు కృతజ్ఞత చెబుతూనే జట్టులో ఎవరెవరు ఉండాలి అనే అంశంపై చర్చిస్తారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. 


గురువారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో పాటు, పలు రాష్ట్రాలకు నాయకులకు కూడా రేవంత్ ఆహ్వానం పంపించనున్నారు. గురువారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9వ తేదీన సోనియాకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ సభ ఉంటుందని మాత్రం కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.