Telangana CM Candidate Revanth Reddy: హైదరాబాద్: తెలంగాణ సీఎం ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా డిసైడ్ చేసినట్లు సమాచారం. విషయం తెలియగానే హోటల్ ఎల్లాకి కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. సీపీఐ అగ్రనేతలు సైతం హోటల్ కు చేరుకున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులు హోటల్ ఎల్లాకి చేరుకుని రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ సహా కాంగ్రెస్ కీలక నేతలతో సీపీఐ అగ్రనేతలు భేటీ అయ్యారు. నేటి సాయంత్రం సీఎం పేరును డీకే శివకుమార్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో సీపీఐ నేతలు, హోటల్ కు చేరుకుని రేవంత్ తో భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. 


మరోవైపు TPCC ఉపాధ్యక్షులు మల్లు రవి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తెలంగాణ జన సమితి (TJS) అధ్యక్షుడు, ప్రొ.కోదండరాంని మర్యాదపూర్వకంగా కలిశారు. టీజేఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదివరకే ప్రకటించడం తెలిసిందే.


2 రోజుల నుంచి హోటల్ లోనే రేవంత్..
కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హోటల్ పల్లా నుంచి బయటకు రాలేదు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఖర్గే నేతృత్వంలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ తదితర అగ్రనేతలు ఢిల్లీలో సమావేశమై సీఎం ఎంపికపై చర్చించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రెండు రోజులనుంచి హోటల్లోనే ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిస్కస్ చేశారని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలుపై సమావేశం జరిగింది. 


రేవంత్ రెడ్డిని కలవడానికి ఉన్నతాధికారులు హాటల్ కు క్యూ కడుతున్నారు. రేవంత్ పేరు కన్ఫామ్ చేస్తున్నారని తెలియగానే అధికారులు టీపీసీసీ చీఫ్ ను కలిసి ఫ్లవర్ బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి ఉన్న హోటల్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాహుల్ గాంధీ సూచించిన పేరు అని రేవంత్ కే అధిష్టానం మొగ్గుచూపిందని ప్రచారం జరుగుతోంది.


సాయంత్రం సీఎం పేరు ప్రకటన.. 
తెలంగాణలో కొత్త సీఎం అంశంపై ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ జరిగింది. ఈ సమావేశంలో మల్లిఖార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివ కుమార్ సహా ఇతర ఏఐసీసీ కీలక నేతలు పాల్గొన్నారు. నిన్నటి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్‌ గాంధీ తన నివాసానికి వెళ్లిపోగా... కేసీ వేణుగోపాల్, మాణిక్ రావ్ ఠాక్రే, డీకే శివకుమార్ హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ వచ్చాక ఢిల్లీలో ఖరారుచేసిన సీఎం పేరును మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు.