Telangana Assembly News: విద్యుత్ కుంభకోణాలపై విచారణ చేస్తున్న కమిషన్‌కు సాయంత్రానికి కొత్త ఛైర్మన్ నియమిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్‌పై సభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల బిజీ కారణంగా ఇన్ని రోజులు ఆలస్యమైందని సభకు వివరించారు. విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమై పేరుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
బీఆర్‌ఎస్ చెప్పినట్టుగానే సాయంత్రానికి విద్యుత్ కమిషనకు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని సభలో వివరించారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు వల్ల కాస్త ఆలస్యమైందని గుర్తు చేశారు. ఇప్పుడే దీనిపై విద్యుత్ శాఖ మంత్రితో కూర్చొని చర్చించి ఛైర్మన్ పేరు ప్రకటిస్తామన్నారు. ఈ కమిషన్ విషయంలో కోర్టు తీర్పును కూడా బీఆర్‌ఎస్ సభ్యులు వక్రీకరించి సభను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇలా మాట్లాడితే కచ్చితంగా ఇలా మాట్లాడేవాళ్లను కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొందని వివరించారు. విచారణపై ఎటువంటి కామెంట్స్ చేయలేదని ఆపాలనే తీర్పు ఇవ్వలేదన్నారు.
బీఆర్‌ఎస్ నేతల కోరిక మేరకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు రేవంత్. ఇప్పుడు దొరికిపోయామని అర్ధమైంది కాబట్టే కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కావాలన్నది వాళ్లే సెగ తగలగానే వద్దంటూ కోర్టులకు వెళ్తున్నది వాళ్లేనన్నారు. తిన్నింటి వాసాలులేక్కబెట్టే బుద్దులు తమకు లేవన్నారు రేవంత్ రెడ్డి. విద్యుత్ కుంభకోణంపై సభలో చేస్తున్న వాదన ఏంటో కమిషన్ ముందు చెప్పాలని సూచించారు.
ఛత్తీస్‌గఢ్, యాదాద్రి, భద్రాద్రి ఒప్పందాలపై బీఆర్‌ఎస్ సభ్యులే విచారణకు డిమాండ్ చేశారని తెలియజేశారు. బీఆర్‌ఎస్ సభ్యుల కోరిక మేరకే విచారణ కమిషన్ వేశామన్నారు. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్‌పైనే ఆరోపణలు చేశారన్నారు. తీరా విచారణకు హాజరై వివరాలు ఇస్తారేమో అని చూస్తే కమిషన్‌ను రద్దు చేయాలని కోర్టులకు వెళ్లారని ఎద్దేవా చేశారు. హైకోర్టులో వాళ్ల పిటిషన్ కొట్టివేతగురైందని... తర్వాత సుప్రీంకోర్టులో వేశారని గుర్తు చేశారు. అక్కడ విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిందని... కానీ కొత్త కమిషన్ చైర్మన్‌ను నియమించాలని సూచించిందన్నారు. దీనిపై తమను అడిగితే ఛైర్మన్‌ను మార్చడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టు పేర్కొన్నారు.
ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు బీఆర్‌ఎస్ నేతలు దండుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లు బీఆర్‌ఎస్ చేసిన నిర్వాకంతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నీళ్లలో నేటికీ మునిగిపోతోందని వాపోయారు. 2021లో పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకుంటే ఇప్పటి వరకు పూర్తి కాలేదని వివరించారు. ఇంకా ఎన్ని రోజులకు పూర్తి అవుతుందో కూడా తెలియదని అన్నారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీలో జగదీష్‌రెడ్డి వర్సెస్ వెంకట్ రెడ్డి- రాజకీయాల నుంచి తప్పుకుంటామంటూ సవాళ్లు
పవర్ ప్లాంట్స్‌కు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టు విషయంలో బీఆర్‌ఎస్ తెలివి ప్రదర్శించిదని వివరించారు రేవంత్ రెడ్డి. గంపగుత్తగా బీహెచ్ఎల్ కాంట్రాక్టు అప్పగించారని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్స్ మొత్తం వీళ్ల బినామీలు, బంధువులకు ఇచ్చారని ఆరోపించారు. ఈ పనుల్లో వేలకోట్ల ఫ్రాడ్ జరిగిందని... విచారిస్తే అంతా బయటకు వస్తుందని పేర్కొన్నారు. అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోదంని విమర్శించారు.