Weather Report: రాష్ట్రంలోని కీలక జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా నీ రు చేరడంతో నిండు కుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోని కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలు సమయానికి 3.79 లక్షల కూసెక్కులు వచ్చి చేరగా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువనకు 61,111 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరముంది. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతోపాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశముంది. దీంతో మంగళవారం ఉదయం 10 గటలు నుంచి 11 గంటలు మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండడంతో నీటి నిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది. మహరాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కృష్ణా నది ఎగువన వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మటి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 3.25 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 2.98 లక్షల క్యూసెక్కులు దిగువనకు వదిలేస్తున్నారు. 


ఉధృతి కొనసాగుతున్న తుంగభద్ర


తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 1.51 లక్షల క్యూసెక్కులను దిగువనకు వదిలేస్తున్నారు. దీంతో మంత్రాలయం వద్ద వరద ఉధృతి మరింత పెరిగి, ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. సంకేశుల బరాజ్‌లోకి 1.49 లక్షలు క్యూసెక్కులు చేరుతుండగా, కేసీ కెనాల్‌కు 1,540 క్యూసక్కులను వదులుతూ, 1.46 లక్షల క్యూసెక్కులను దిగువనకు వదిలేస్తున్నారు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. 


భద్రాచలం వద్ద తగ్గుముఖం..


శనివారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద 53.60 అడుగులతో మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన వరద, ఆదివారం ఉదయం 6 - 7 గటల మధ్య 53 అడుగులు దిగువనకు, రాత్రి 11 గంటల సమయానికి 47.20 అడుగులకు తగ్గింది. దీంతో తొలుత అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఆ తరువాత రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ప్రవాహం సైతం 14,36,573 క్యూసెక్కుల నుంచి 11,08,154 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ఏపీలోని చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్‌ వే 48 గేట్లు ద్వారా దిగువనకు వదిలేస్తున్నారు. 


అక్కడా తగ్గుతున్న తగ్గుతున్న వరద ప్రవాహం


గోదావరి పరివాహక ప్రాంతంలోని మహరాష్ట్ర, చత్తీష్‌ఘడ్‌, ఒడిశాతోపాటు తెలంగాణలో వర్షాలు తునిసి ఇవ్వడంతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5,39,200 క్యూసెక్కులు ప్రవాహం రాగా ఆదివారం అదే సమయానికి 4,06,510 క్యూసెక్కులకు తగ్గింది. సమ్మక్క బ్యారేజ్‌ వరద 9,75,910 క్యూసెక్కుల నుంచి 8,45,560 క్యూసెక్కులకు తగ్గింది. సీతమ్మసాగర్‌ బ్యారేజ్‌కు సైతం వరద 13,95,637 క్యూసెక్కులు నుంచి 11,65,362 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ మూడు బ్యారేజ్‌లకు వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. 


నేడు, రేపు తేలికపాటి వర్షాలు


రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కరిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో అక్కడక్కడ బలమైన గాలులు వీస్తాయనిఇ పేర్కొంది. ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ములుగు జిల్ల మల్లంపల్లిలో 3.3, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి)లో 1.9 సెంటీ మీటర్లు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం గ్రేటర్ లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. షేక్ పేట, గచ్చిబౌలి, ఆసిఫ్ నగర్, మెహదీపట్నం, గన్ ఫౌండ్రి, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం మోస్తారు వర్షాలు కురిసాయి.