జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కాబోతోంది! తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే ఈ కట్టడాన్ని వేగంగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను, ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని చెప్పారు. విధించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సర్వం సిద్దం కావాలని చెప్పారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చే నెలలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా అమరజ్యోతి ప్రారంభం అవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.


హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నది. అమర జ్యోతి ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెయిన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిప్టులు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పైఅంతస్థులో రెస్టారెంట్, నిరంతరం జ్వలించే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎం కేసిఆర్ ఆదేశానుసారం అధికారులకు, నిర్మాణ సంస్థ కు పలు సూచనలు చేశారు.


తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర నడి బొడ్డున, హుస్సేన్ సాగర్ తీరాన ఈ నిర్మాణం చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరుదైన స్టెయిన్ స్టీల్ తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అతపెద్ద కట్టడం ఇదేనని అన్నారు. ఈ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన తర్వాత, ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని చెప్పారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు ఉండబోతున్నాయని అన్నారు.


ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడం


ఇది పూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని కోరారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని,చార్ట్ ప్రకారం పనులు పూర్తి చేసి కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్దం చేయాలని అదేశించారు. అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని కోరారు.


వందేళ్లయినా తుప్పు పట్టని అతుకుల్లేని స్టీల్ కట్టడం


ఎక్కడా అతుకులు కనిపించని ఒక భారీ స్టీల్ భవనం ఇది. దీని ఆకృతి మట్టిదీపంలా ఉంది. అమరులకు దీపంతో నివాళి అర్పిస్తారు కాబట్టి ఈ నమూనాతో నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ బిల్డింగ్. భవంతి ఒకదియా లాగా ఉంటే, అందులో అఖండదీపంలాగా జ్వాల వెలగబోతోంది! మట్టిదీపాన్ని ప్రాతిపదికగా చేసుకుని దానికి కాంటెంపరరీ మాడ్రన్ ఫామ్ అద్దారు! ఇందులో వాడిన స్టీల్ అత్యంత నాణ్యమైన హయ్యర్ గ్రేడ్ స్టీల్. ఆ రకాన్ని 316 L అని పిలుస్తారు. అది వందేళ్లయినా తుప్పు పట్టదు. బిల్డింగ్ అంటే బిల్డింగ్ కాదు.. ఇదొక శిల్పం అంటాడు దీని రూపకర్త. దీపం పక్కన రెస్టారెంట్. 700 మంది కూర్చునేలాగా కన్వెన్షన్ హాల్. ఒక మినీ థియేటర్‌ ఉంటుంది. లోపలికి వెళ్లి బయటకొచ్చిన తర్వాత, ఎవరికైనా అర్ధమవుతుంది -తెలంగాణ సాధన క్రమంలో ఏం జరిగిందో! అమరవీరుల గురించి తెలుసుకుంటారు. తెలంగాణ చారిత్రక అవసరం బోధపడుతుంది. ఎలా ఉద్యమం జరిగింది.. తొలి, మలిదశ ఉద్యమం ఎలా పురుడుపోసుకుందీ.. తదితర విషయాలు మ్యూజియంలో చెబుతారు. అందులో 15-20 నిమిషాల నిడివున్న ఫిలిం డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. వందల కి.మీ వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా జ్వాలను తయారుచేశారు. సూర్యాస్తమయం అవుతున్నా కొద్దీ జ్వాల ప్రజ్వరిల్లుతూ, గాలికి సుతారంగా ఊగుతూ, నిజమైన అఖండదీపంలా కనిపిస్తుంది. ప్రారంభోత్సవం తరువాత అనేక రికార్డులు నెలకొల్పి, చరిత్రలో నిలిచిపోతుందని డిజైనర్ చెబుతున్నారు.


ఇలాంటిదే చికాగోలో ఉంది.. దాన్ని చూసే కట్టారు!


సరిగ్గా ఇలాంటి కట్టడమే చికాగోలో ఉంది. ఆ స్టీల్ కట్టడం పేరు క్లౌడ్ గేట్. లూప్ కమ్యూనిటీ ప్రాంతంలోని మిలీనియం పార్క్‌లో దీన్ని నిర్మించారు. భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ కళాకారుడు అనీష్ కపూర్ రూపొందించాడీ పబ్లిక్ శిల్పాన్ని. దాని ఆకారం కారణంగా "ది బీన్" అని పేరు పెట్టారు. అది ఇల్లినాయిస్ నగరానికే కాదు, చికాగో రాష్ట్రానికే ఒక ఐకాన్‌గా నిలిచింది. అలాంటి ఐకాన్ కట్టడమే భాగ్యనగరంలో అమరజ్యోతి రూపంలో సాగరతీరాన నిలవబోతోంది.