సరదాగా రీల్స్ చేద్దామని వెళితే ఏకంగా ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదేంటి రీల్స్ చేస్తే ప్రాణాలు పోవడం ఏంటంటారా. అతడు రీల్స్ ట్రై చేసింది ఇంటి వద్దో, మైదానంలోనో కాదు. ఏకంగా రైలు పట్టాల వద్దకు వెళ్లి రీల్స్ చేసే ప్రయత్నంలో రైలు ఢీకొనడంతో బాలుడు మృతిచెందినట్లు సమాచారం. చేసేవి చిన్న పొరపాట్లే కానీ, ప్రాణాలు పోతాయని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం అని పోలీసులు చెబుతున్నారు. 


అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్‌కు చెందిన మదర్సా విద్యార్థి మహ్మద్ సర్ఫరాజ్(16) రీల్స్ చేద్దామని భావించాడు. తన స్నేహితులతో కలిసి సనత్​ నగర్​లోని రైల్వే లైన్ వద్దకు వెళ్లాడు. ఆపై ఫ్రెండ్ కు ఫోన్ ఇవ్వగా అతడు ఇన్ స్టా రీల్స్ కోసం వీడియోలు తీస్తున్నాడు. అయితే రీల్స్ సరదా ప్రాణం తీస్తుందని ఆ బాలురు అనుకోలేదు. రైల్వే ట్రాక్ పక్కన సర్ఫరాజ్ నిల్చోగా మరో ఫ్రెండ్ వీడివయో తీస్తున్నాడు. కానీ వెనుక నుంచి వస్తున్న రైలును సర్ఫరాజ్ గమనించలేదు. అతడి ఫ్రెండ్ కూడా అలర్ట్ చేయలేదు. ఈ క్రమంలో రీల్స్ చేస్తున్న సర్ఫరాజ్ ను వెనుక నుంచి రైలు ఢీకొట్టింది. దీంతో సర్ఫరాజ్ విద్యార్థి సర్ఫరాజ్ మృతి చెందాడు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో అతడితో పాటు రీల్స్ చేయడానికి వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్స్ భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సనత్ నగర్ రైల్వే స్టేషన్ లైన్ వద్దకు చేరుకుని విద్యార్థి సర్ఫరాజ్ మృతదేహాన్ని  గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చనిపోయిన విద్యార్థి ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చెక్ చేయగా సర్ఫరాజ్ వెరైటీగా రీల్స్ చేస్తున్నాడని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.