Liquor Prices Reduced In Telangana: మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గినట్లు వెల్లడించింది. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ ట్యాక్స్ కొంత మేర తగ్గించడంతో పలు రకాల మద్యం బ్రాండ్స్ పై ధరలు దిగొచ్చాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ పై రూ.20 మేర, ఫుల్ బాటిల్ పై రూ.40 మేర ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం అక్రమ రవాణా జరుగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిందని ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. 


ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న మద్యం ధరలు.. 


కేరళలో మందుబాబులకు షాకింగ్ న్యూస్. మద్యం ధరలు పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై సేల్స్ ట్యాక్స్‌ను బుధవారం 4 శాతం పెంచింది. దాంతో కేరళలో మద్యం ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో విదేశీ మద్యాన్ని తయారు చేసి విక్రయించే డిస్టిలరీలపై విధిస్తున్న ఐదు శాతం టర్నోవర్ ట్యాక్స్ (ToT)ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిస్టీలరిలపై టర్నోవర్ టాక్స్ మాఫీ చేయటం వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని, దాని పుడ్చుకోవడానికి రాష్ట్ర జనరల్ సేల్స్ టాక్స్ రేటును 4 శాతం పెంచుతూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విదేశీ మద్యం తయారీ, విక్రయాలు చేస్తున్న డిస్టిలరీలపై ఉన్న 5 శాతం టర్నోవర్ టాక్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాష్ట్ర జనరల్ సేల్స్ టాక్స్ రేటును 4శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేరళ క్యాబినెట్. 


లిక్కర్‌పై సెస్ పెంపు..


మందు బాబులకు ఇదో చేదు వార్త. లిక్కర్, బీర్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. సెస్‌ కింద ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.17 కట్టాల్సి ఉంటుంది. అంతకు ముందు ఈ పన్ను కేవలం రూ.7గా ఉండేది. ఇప్పుడు ఏకంగా పది రూపాయలు పెంచి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదూ. హిమాచల్‌ ప్రదేశ్‌లో. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మద్యంపై సెస్‌ను పెంచుతున్నట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు వెల్లడించారు. వీటితో పాటు మిల్క్ సెస్‌ను కూడా పెంచారు. ఒక్కో పెట్ బాటిల్‌పై రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు. Godhan Development Fund కింద మరో రూ.2.50 కట్టాలి. 


అంతకు ముందు ఉన్న కొవిడ్ సెస్‌ను తొలగించి ఆ స్థానంలో కొత్త సెస్‌లను తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మద్యం, పాలపై పన్ను భారం మోపారు. ఈ సెస్‌లో ప్రతి బాటిల్‌పై రూ.1.50 మేర ఎక్సైజ్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు వెళ్తుంది. రూ.2 మేర సెస్‌ను పంచాయతీ రాజ్‌ నిధులకు తరలిస్తారు. పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. వీటితో పాటు హెల్త్ సర్వీసెస్‌ విభాగానికీ రూ.1 మేర సెస్‌ కేటాయిస్తారు.