Siddipet News: వంతుల వారిగా పోషించాలన్న కుమారుల నిర్ణయాన్ని ఓ కన్న తండ్రి జీర్ణించుకోలేకపోయారు. తన సొంతూరిని వదిలి మరో ఊరికి వెళ్లడం ఇష్టం లేక.. తన కుమారులకు భారం కాలేక తనువు చాలించాడో వృద్ధుడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగింది. 


అసలేం జరిగిందంటే?


పొట్లపల్లికి చెందిన  90 ఏళ్ల మెడబోయిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో ఒకరు హుస్నాబాద్ లో మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేట లో నివసిస్తున్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. వెంకటయ్యకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలోనే ఆయన పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవాడు. అయితే ఆయన పోషణ విషయంలో ఐదు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నెలకు ఒకరి చొప్పున నలుగురు కుమారులు వంతుల వారిగా పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది.


సొంత ఊరు, ఇంటిని వదిలి అక్కడికి తాను వెళ్లనని వెంకటయ్య చెప్పేవారు. ఈనెల 2 న మంగళవారం సాయంత్రం ఇంటి నుండి బయలు దేరిన ఆయన గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధ వెళ్లగక్కారు. 3వ తేదీన నవాబుపేటలోని మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, నవాబుపేట రోడ్డులో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో తాటికమ్మలను ఒక చోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మహత్యకి పాల్పడినట్లు భావిస్తున్నారు.