Hyderabad TIMS Hospital: హైదరాబాద్‌లో మరో మూడు కొత్త సూపర్ స్పెషాలిటీ స్థాయి హాస్పిటళ్లు వచ్చేందుకు నేడు పునాది పడబోతోంది. హైదరాబాద్‌లో మూడు దిక్కులా మూడు ప్రాంతాల్లో కొత్తగా TIMS (Telangana Institute of Medical Sciences) ఆసుపత్రులకు నిర్మించనున్నారు. ఈ మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ నేడు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు గడ్డి అన్నారంలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం సనత్ నగర్ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అల్వాల్ ఆస్పత్రికి భూమి పూజ చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.
మొత్తం రూ.2,679 కోట్లతో ఆస్పత్రులు
ఈ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.2,679 కోట్లు కేటాయించింది. ఈ మేరకు గురువారం జీవో జారీ చేశారు. ఎల్బీ నగర్ గడ్డి అన్నారంలో నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.900 కోట్లు, సనత్ నగర్‌లో నిర్మించే ఆస్పత్రికి రూ.882 కోట్లు, అల్వాల్ టిమ్స్‌కు రూ.897 కోట్లు కేటాయించారు.
ప్రస్తుతం గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది నగరానికి ఒకవైపు ఉండగా, మిగతా మూడు వైపులా ఇలాంటి టిమ్స్ ఆస్పత్రులనే నిర్మిస్తామని కేసీఆర్ అప్పుడే ప్రకటించారు. ముఖ్యంగా అల్వాల్ - ఓఆర్‌ఆర్ మధ్య నిర్మించే సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల వల్ల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్య లేకుండా వైద్య సేవల కోసం రావచ్చు.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వల్ల నల్గొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రజలకు, గచ్చిబౌలిలోని టిమ్స్ వల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు చేరువ అవుతాయి. ప్రస్తుతం జిల్లాల నుంచి వచ్చే రోగులు నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఆస్పత్రులకు ప్రయాసపడి చేరుకోవాల్సి వస్తోంది.