ఏబీపీ దేశం: రెండు మూడు రోజులుగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఎలాంటి క్వశ్చన్‌కు మీరు ఆన్సర్ చేయాలనుకుంటున్నారు. ?
కేటీఆర్: తెలంగాణ సాధించిందేంటి..? మీకు ఎందుకు ఓటు వేయాలనేది? రిలవెంట్ క్వశ్చన్ ఎందుకంటే... 75 స్వాతంత్ర్య భారత దేశంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదు. వచ్చినా చేయలేదు... రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఏ లీడర్‌కు రాలేదు. అది ఒక్క కేసీఆర్ ఆలోచించారు. చేసి చూపించారు. ఎప్పుడూ చైనాలో రెండేళ్లలో ప్రాజెక్టు కడతారటా అని చెప్పుకోవడమే తప్ప మన దేశంలో చూసింది లేదు. కానీ నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మాది. అలాంటి విషయాలను వదిలేసిన మీడియా పనికిరాని విషయాలపై ఫోకస్ చేస్తోంది. అందుకే ఇదే కరెక్టైన క్వశ్చన్ అని నా అభిప్రాయం.
ఏబీపీ దేశం: ఇలాంటివి రోజూ మీరు చెప్తుంటారు... ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉన్న ఓటీటీల్లో మీరు చూస్తున్న సిరీస్ ఏంటి?
కేటీఆర్: వెబ్‌సిరీస్‌లు చూడలేదు కానీ.. నిన్న, మొన్న డీజే టిల్లు సినిమా చూశాను చాలా బాగా నచ్చింది.
ఏబీపీ దేశం: తెలంగాణలో ఎన్నికలు 2023లో ఉన్నాయి కానీ.. సోషల్ మీడియాలో చూస్తే మాత్రం రేపే అన్నట్టు ఉన్నాయి. స్టేట్‌మెంట్స్, మీమ్స్, ఇలా చాలానే వస్తున్నాయి. అలాంటి మీమ్స్‌లో మీకు నచ్చిందేదైనా ఉందా?
కేటీఆర్: చాలా ఉన్నాయి. కేసీఆర్ తన ప్రెస్‌మీట్‌లో ఇప్పుడేం చేద్దాం మరీ అంటారు. అది చాలా బాగా నచ్చింది.
ఏబీపీ దేశం: ఇప్పుడు రాజకీయం అంతా పంచ్‌డైలాగ్స్, జిప్స్, మీమ్స్ అంతేనా.. అంతకు మించి లేదా?
కేటీఆర్: నేటి తరం చాలా పరిమితిలో ఉండిపోతుంది. యూ ట్యూబ్ షాట్స్ లాంటివి ఎక్కువ చూస్తున్నారు. మిలీనియల్స్ అంతా న్యూస్, ఇన్ఫర్మేషన్ కోసం సోషల్ మీడియాపైనా ఆధారపడుతున్నారు. సమాచారం కూడా ప్యాకేజ్‌లా మారిపోయింది. ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండు వేరుగా అందించలేం. ఈ రెండూ కలిపి ఇన్ఫోర్టైన్‌మెంట్‌గా మారిపోయింది. చాలా మందికి అర్థం కాని ఈ మిక్స్‌డ్ కాక్‌టెయిల్ నేటి తరం ఇష్టపడుతోంది.
ఏబీపీ దేశం: అది రాజకీయంగా అడ్వయిజబుల్ అంటారా?
కేటీఆర్: మారుతున్న కాలానికి అనుగుణంగా మారకుంటే కాలగర్భంలో కలిసిపోతారు. నేను యూఎస్‌లో ఉండేటప్పుడు నాకు ఓ విషయం ఆశ్చర్యపరిచేది, లేట్‌నైట్ కామెడీ షోలు ఉంటాయి. డేవిట్ లెటిమెర్‌కు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ను. ఈ కామెడీ షోలకు ఎందుకింత ప్రాధాన్యత అనుకునే వాడిని. కొన్ని రోజుల తర్వాత నిజాన్ని తెలుసుకున్నాను. చాలా సమాచారం డేవిడ్ లెటిమెర్ ద్వారానే తెలుసుకునే వాళ్లు. న్యూస్ చూడటం ఇష్టం లేని వాళ్లు కూడా ఇలాంటి షోల్లో క్విక్‌గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ మారాల్సిందే. యూ ట్యూబ్‌లో డిజిటల్ మీడియంలో కొత్త కొత్తగా వస్తున్న మాధ్యమాల్లో పాలు పంచుకోవాల్సిందే.
ఏబీపీ దేశం: మీరు చెబుతున్న షోలు ఇండియాలో చేసే అవకాశం ఉందా?
కేటీఆర్: కచ్చితంగా చేయచ్చు. కానీ ఇండియాలో చూస్తే మనం చాలా సున్నితమైనవాళ్లం. మనది చాలా సున్నితమైన దేశం. ప్రతి అంశంపై మన రియాక్ట్ అవుతాం. దురుదృష్టవశాత్తు మనం కొన్నిసార్లు చాలా వైల్డ్‌గా రియాక్ట్ అవుతాం. మన కంట్రీ ఇంకా మెచ్యూరిటీ వచ్చినట్టు లేదు.
ఏబీపీ దేశం: డైవర్సనరీ పాలిటిక్స్‌లో భాగంగా బీజేపీ సినిమాలను కూడా వాడుతుంది అన్నారు.?
కేటీఆర్: బీజేపీ కానీ వాళ్లకు మద్దతు ఇస్తున్న వర్గాలు గానీ సినిమాను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. ఎలా అంటే.. ఎలక్షన్ టైంలో యురీ వస్తుంది. తర్వాత కశ్మీర్ ఫైల్స్ వస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అక్షయ్ కుమార్ సినిమాలు వస్తాయి. రేపు ఆదిపురుష్ వస్తుంది. అయోధ్య రామమంధిరం పూర్తి అయ్యేసరికి ఇక్కడ ఆదిపురుష్ సినిమా వస్తుంది. ఇవన్నీ ఓ వ్యూహం ప్రకారం, సినిమాలను కూడా జనం దృష్టిని మరల్చడానికి లేదా ఆకట్టుకోవడానికి వాడుతున్నారు. తప్పేం లేదు. ఇదే స్ట్రాటజీ. ఇది తెలియని జనం కొన్నిసార్లు ఓవైపు మాత్రమే ఆలోచించడం మొదలు పెడతారు.
ఏబీపీ దేశం: మూడో సారి ఎన్నికల్లో బీజేపీని విమర్శించడమే పార్ట్ లేకుంటే తెలంగాణలో చేసిన అభివృద్ధిని ప్రొజెక్ట్ చేస్తారా? ఏమని ప్రజలను ఒప్పిస్తారు. మీకే ఎందుకు ప్రజలు ఓటు వేయాలి?
కేటీఆర్: మేం ఏం చేశామె చెప్పాలంటే గంటల కొద్దీ చెప్పగలం. మా ప్రత్యర్థులు కూడా అది చేయాలి కదా. నేను బీజేపీని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ కోసం ఏం చేసింది? ఒక్క ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ఇచ్చారా.. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా? ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చారా? ఏదైనా ఒక్కటి దేశానికి రాష్ట్రానికి పనికొచ్చే పని చేశారా? ఏదైనా ఓ వర్గం లాభపడిందా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు అయిందా? రైతుల కష్టాలు రెట్టింపు చేశారు? 2022 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఇచ్చారా? నల్లదనం మొత్తం తెస్తాం... పదిహేను లక్షలు అకౌంట్లో వేస్తామన్నారు ఇచ్చారా? ఇలా అడిగితే వాళ్లకు కోపం వస్తుంది. అందుకే ఏం చేస్తారు. డైవర్షన్ టాక్టీస్ ప్రయోగిస్తారు. హలాల్, హిజాబ్ , హనుమాన్ ఛాలీసా తెరపైకి తీసుకొస్తారు. ఎన్నిరోజులు పాకిస్థాన్‌తో పోటీపడతాం... ఎన్ని రోజులు అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌తో పోల్చుకుందాం. చైనా, అమెరికా, జపాన్ దూసుకొని పోతుంటే అది మరిచిపోయి ఎంత సేపు పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉన్నాం అని సంతోష పడదామా? 75 ఏళ్లైంది భారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఆ విధంగానేనా ఆలోచించాలి.
ఏబీపీ దేశం: మీరు చెబుతున్న అజెండాతో తెలంగాణ ప్రజలు మీకు ఓటు వేస్తారని నమ్ముతున్నారా?
కేటీఆర్: వంద శాతం. దేశం, తెలంగాణ ప్రజలు చాలా స్మార్టర్. కొన్ని రోజులు వాళ్లో వీళ్లో ఏదో చెప్పి మోసం చేయవచ్చు గానీ...చివరకి మాత్రం ప్రజలు ఆలోచన వేరేలా ఉంటుంది.
ఏబీపీదేశం: 2024లో జాతీయ స్థాయిలో అలయన్స్‌తో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? పీకే అందుకే ఇక్కడకి వచ్చారా?
కేటీఆర్: 2024కి చాలా సమయం ఉంది. ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్ పాలన ఈ దేశం ప్రజలు చూశారు. చాలా సమస్యలు వదిలేశారు. నమ్మకమైన ప్రత్యామ్నాయానికి మాత్రం చోటు ఉంది. అది ఏ రూపంలో వస్తుందో నాకు తెలియదు. మాకైతో కొన్ని కోరికలు ఉన్నాయి. కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేశం కోసం అజెండా సెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాలం గడుస్తున్న కొద్ది ప్రజల మద్దతు ఏదైనా జరగొచ్చు.
ఏబీపీ దేశం: మీకు మెయిన్ ప్రత్యర్థి ఎవరు?
కేటీఆర్: ఇప్పుడున్న అసెంబ్లీ బలాల బట్టి చూస్తే మజ్లిస్ మాకు మెయిన్ ప్రత్యర్థి. ఇదే రేపు కంటిన్యూ అయితే మజ్లీస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండొచ్చు.
ఏబీపీ దేశం: జీహెచ్‌ఎంసీలో మీరు మజ్లిస్ అలయన్స్‌లో ఉన్నారు కదా?
కేటీఆర్: అలాంటిదేమీ లేదు. ఇప్పటి వరకు లేదు.. ఇకపై కూడా ఉండదు.
ఏబీపీ దేశం: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఇస్తున్న స్టేట్‌మెంట్స్‌కు మీమ్స్‌లో రెస్పాండ్ అవ్వాలంటే ఏ మీమ్‌తో రియాక్ట్ అవుతారు.?
కేటీఆర్: వాట్ ద హెల్ ఎన్డ్ హెవెన్ సరిగ్గా సరిపోతుంది. నవీన్ పొలిసెట్టీ, డైరెక్టర్ అనుదీప్‌కు చాలా థాంక్స్. నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమాల్లో జాతిరత్నాలు ఒకటి. తెలంగాణ యాసను తీసుకొని చాలా బాగా చేశారు. జాతిరత్నాలు, డీజే టిల్లు తెలంగాణకు ప్రైడ్‌ను తీసుకొచ్చారు. జోకర్స్‌గా బఫూన్స్‌గా అవమాన పరిచిన భాషనే ఇవాళ హీరోలు, ప్రధాన పాత్రధారులు వాడుతున్నారు. ఇది నిజంగానే ప్రైడ్ కదా.
ఏబీపీ దేశం: పీకేతో నేను కర్రీస్ తెస్తాను.. మీరు రైస్ పెట్టేసే అన్నట్టు ఉంటుందా?
కేటీఆర్: పీకేతో మాకేం ఉంటుంది. ఐప్యాక్‌తో మాకు ఒప్పందం ఉంది. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారో ఆయన్ని మీరు అడగాలి.
ఏబీపీ దేశం: డీజే టిల్లు అన్నట్టు అట్లుంటుంది మీతో అన్నమాట?
కేటీఆర్: కచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు.. మూడోసారి గెలిపిస్తారు