TS Govt Jobs Process : తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. సోమవారం పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల అయింది. తాజాగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విధానంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. గ్రూప్-1 పోస్టులకు 900 మార్కులు, గ్రూప్‌-2 పోస్టులకు 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులతో రాత పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌-4లోని జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. 



ఒక్కో పోస్టుకు 50 మంది 


గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రూప్స్ విభాగంలో భర్తీ కానీ ఇతర ఉద్యోగాలకు ప్రత్యేక పరీక్ష విధానాన్ని అమలు చేయనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రూప్స్‌తో పాటు గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌, సూపర్‌వైజర్, సీనియర్‌ రిపోర్టర్‌, ఇంగ్లీష్‌ రిపోర్టర్‌ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానాలపై ఉత్తర్వులు జారీ చేసింది. 


Also Read : TSPSC Group 1 Notification: గ్రూప్ 1 తొలి నోటిఫికేషన్‌ జారీకి సర్వం సిద్ధం, ఒకట్రెండు రోజుల్లో టీఎస్‌పీఎస్సీ ప్రకటన


పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ 


తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80 వేలకు పైగా ఉద్యోగాల్లో తొలి నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం విడుదల అయింది. కానిస్టేబుల్,  ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. www.tslprb.in  సైట్ ద్వారా ఉద్యోగార్థులు అప్లై చేసుకోవచ్చు.  తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్లు ఆహ్వానించింది. అభ్యర్థులు మే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


Also Read : TS Police Notification : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ