జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు. పదే పదే చంద్రబాబు దత్తపుత్రుడని విమర్శిస్తున్నారు. నిజానికి జనసేన పార్టీ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉంది. టీడీపీతో కలుస్తామని ఎక్కడా చెప్పలేదు. కానీ ఓట్లు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ చేసిన ఒక్క ప్రకటనతో వైఎస్ఆర్‌సీపీ జనసేన ఖచ్చితంగా టీడీపీతోనే వెళ్తుందని ఫిక్సయిపోయి విమర్శల దాడి పెంచింది. జనసేన పార్టీ టీడీపీతో కలిసి వెళ్తే ఏదో జరుగుతుందని వైఎస్ఆర్‌సీపీ ఎందుకు ఆందోళన చెందుతోంది ? ఒంటరిగా పోటీ చేయాలని ఎందుకు సవాళ్లు విసురుతోంది ?
పవన్‌పై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు !
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైఎస్ఆర్‌సీపీ నేతలు టార్గెట్ చేస్తున్న వైనం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా తెరపైకి తెచ్చి విమర్శిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అలాంటి విమర్శలే చేసేవారు. పవన్ కల్యాణ్‌లా పెళ్లిళ్లు చేసుకుంటే నిత్య పెళ్లి కొడుకు పేరుతో అరెస్ట్ చేసేవారని జగన్ అప్పట్లో అన్నారు. నిజానికి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో వివాదాల్లేవు. వివాహ బంధం వైఫల్యంతో సామరస్యంగానే విడిపోయారు. కానీ రాజకీయాలు ఇప్పుడు ఆ విషయాలను తెరపైకి తెస్తున్నారు. పవన్ కల్యాణ్ పై గతంలో ప్యాకేజీ స్టార్ అంటూచేసే ఆరోపణలు మళ్లీ చేస్తున్నారు.
దమ్మంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు !
పవన్ కల్యాణ్ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు సవాళ్లు చేస్తున్నారు. జనసేన పార్టీ ఎలా పోటీ చేస్తే వైఎస్ఆర్‌సీపీకి ఎందుకు అనే డౌట్ రావడం సహజమే. కానీ జనసేన పార్టీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అయింది. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఓ ఫలితం.. టీడీపీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే మరో ఫలితం వస్తుందన్న అభిప్రాయంతో వీలైనంత వరకూ ఆ పార్టీని ఒంటరి పోరుకు వెళ్లేలా చేయాలన్న ఉద్దేశంతోనే రకరకాల ఘాటు విమర్శలతో వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకుని పోటీ చేసి బిచ్చం నాయక్ అని మాజీ మంత్రి అనిల్ అంటే.. ప్యాకేజీ స్టార్ అని మరొకరు విమర్శిస్తున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్‌సీపీకి ఏంటి నష్టం ?
గత ఎన్నికల్లో టీడీపీకి కాస్త తక్కువగా నలభై శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అధికార వైఎస్ఆర్‌సీపీకి యాభై శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో జనసేన ఓటు బ్యాంక్ మినహా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం గెలిచే పార్టీగా ప్రజల్లో నానిన వైఎస్ఆర్‌సీపీకే పడింది. ఇప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉంది. జనసేన బీజేపీతో కలసి పోటీ చేస్తే.. జనసేన ఓటు బ్యాంక్‌తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ పార్టీకి కొంత పడుతుంది. అప్పుడు ఓట్ల చీలికతో వైఎస్ఆర్‌సీపీ లాభపడుతుంది. అదే టీడీపీ, జనసేన కలిస్తే.. జనసేన ఓటు బ్యాంక్.. వ్యతిరేక ఓటు ఏకమవుతుంది. అది ఫలితాలను తారుమారు చేస్తుందన్న ఆంచనాలున్నాయి. అందుకే వైఎస్ఆర్‌సీపీ పవన్ కల్యాణ్ పొత్తుకు వెళ్లకుండా చేయాడానికే వీలైనంత ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ఓట్లు చీలనివ్వబోనని చెప్పినప్పటి నుండే జనసేనపై తీవ్రమైన రాజకీయ విమర్శలు !
పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున వైఎస్ఆర్‌సీపీని గద్దె దించడానికి .. ఓట్లు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అప్పట్నుంచి వైఎస్ఆర్‌సీపీకి పవన్ పై తీవ్ర ఆగ్రహం వస్తోంది. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. ఈ రాజకీయాన్ని పవన్ కల్యాణ్ ఎలా ఎదుర్కొంటారు.? తాను అనుకున్నట్లుగా రాజకీయం చేస్తారా ? అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాలను మార్చే కీలకాంశంగా మారింది.