ప్రగతిభవన్‌లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ సూచించారు.
కాగా ఐటీ, ఈడీ దాడులతో టీఆర్‌ఎస్ నేతల్లో అలజడి మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం అయ్యారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తెల్లవారుతుండగానే మొదలైన సోదాలు
మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నివాసంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 50 బృందాలు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లల్లో కూడా తనిఖీలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి.
అధికారులు దాదాపు 50 టీమ్‌లుగా ఏర్పడి మల్లారెడ్డి నివాసం సహా ఆయన సంస్థలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి సన్నిహితుల నుండి ఐటీ అధికారులు భారీగా డబ్బు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సుచిత్రలో మల్లారెడ్డి అనుచరుడైన త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లను సీజ్ చేశారు.
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి వద్ద రూ.2 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో రఘునాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.2 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు. మరోవైపు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా ఐటీ అధికారులు వెళ్లారు. సంతోష్ రెడ్డి తలుపు ఓపెన్ చేయకపోవడంతో ఐటీ అధికారులు వేచి చూస్తున్నారు. డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లే అలోచనలో ఐటీ ఆఫీసర్స్ ఉన్నారు.
కొత్త విషయాలు వెలుగులోకి
మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు అని గుర్తించారు. సీఎంఆర్ స్కూల్స్‌లో నరసింహ యాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహ యాదవ్, జైకిషన్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు.