Hyderabad News: ఆడ వాళ్లకు షాపింగ్ అంటే ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. గంటలు గంటలు షాపింగ్ చేస్తూ... భర్తలను ఇబ్బంది పెడతారంటూ చాలా మంది కామెంట్లు చేస్తుంటారు. షాపింగ్ మోజులో పడి పిల్లలను కూడా మరిచిపోతారంటుంటారు. అయితే ఇది నిజమేనని నిరూపించిందో మహిళ. కొత్త బట్టలు వేస్కునే మోజలో పడి భర్త కట్టిన తాళినే పక్కన పెట్టేసింది. కావాల్సిన బట్టలన్నీ తీసుకొని వెళ్లింది కానీ.. పక్కన పెట్టిన తాళిని మర్చిపోయి వెళ్లింది. ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


హైదరాబాద్ లోని ఓ జంట.. పంజాగుట్ట పరిధిలోని ఓ షాపింగ్ మాల్ కు వెళ్లింది. తనకు నచ్చిన బట్టలన్నీ సెలెక్ట్ చేసుకుంది. వాటిని ట్రయల్ చేసేందుకని.. ట్రయల్ రూంలోకి వెళ్లింది. వాటిని మార్చుకునే క్రమంలో మెడలో ఉన్న తాళి బొట్టు తీసి పక్కన పెట్టింది. తనకు కావాల్సిన బట్టలన్నీ ట్రై చేసి నచ్చిన వాటిని తీసుకని వెళ్లిపోయింది. కానీ మెడలోంచి తీసిన తాళిని మాత్రం మరిచిపోయింది. ఇంటికి వెళ్లాక తాళి విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే పరుగుపరుగున మళ్లీ షాపింగ్ మాల్ కి వచ్చింది. కానీ ఆమె ట్రయల్ చేసిన రూంలోకి వెళ్లే సరికి ఆ తాళిబొట్టు అక్కడ లేదు. అదే విషయాన్ని షాపింగ్ మాల్ సిబ్బందికి తెలిపింది. అయినప్పటికీ లాభం లేకపోయింది. 


అయితే 6 తులాల మంగళ సూత్రం పోవడంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. షాపింగ్ మాల్ సిబ్బందిని ఆరా తీశారు. సీసీ టీవీ కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్..!


హైదరాబాద్ గచ్చిబౌలిలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన మహాత్మా గాంధీ యూనివర్శిటీ సర్టిఫికెట్లను ఈ ముఠా మార్కెట్ లో చలామణి చేస్తోంది. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ సర్టిఫికెట్ల విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


ఈ కుంభకోణంలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో డైరెక్టరుగా ఉన్న మిల్లి గోయల్.. క్లర్కుగా పనిచేస్తున్న శివనిలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 430 మంది విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. దీని కోసం ఒక్కో విద్యార్థి నుంచి లక్షా 50 వేల నుంచి రూ. 2 లక్షల 50 వేల వరకు వసూలు చేేసినట్లు పేర్కొన్నారు. ఈ దందా 5 సంవత్సరాలుగా జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. ముఖ్యంగా బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ, బీఎస్పీ కంప్యూటర్స్ లాంటి కోర్సుల విద్యార్థులు ఈ నకిలీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి యూనివర్శిటీకి సంబంధించిన సర్టిఫికెట్లు, ల్యాప్ టాప్, స్టాంపులు, రూ. 50 వేల నగదు, 7 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ. 37 లక్షల 50 వేలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.