Minister Talasani Srinivas Yadav Comments: తెలంగాణలో మంత్రులు లక్ష్యంగా జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు తాము భయపడబోమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు జంకేది లేదని తేల్చి చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరుగుతున్నందున ఆ అంశంపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలంగాణలో టీఆర్ఎస్ నేతల్ని టార్గెట్‌ చేస్తున్నాయని అన్నారు. వాటిని ఎదుర్కొని తీరతామని చెప్పారు. ఈ దాడులను తాము ముందే ఊహించామని చెప్పారు. దాడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ముందే అలర్ట్ చేశారని గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవస్థలు నేడు వాళ్ల చేతుల్లో ఉన్నా.. రేపు తమ చేతుల్లో ఉంటాయని అన్నారు. ఏ విషయాన్ని అయినా రాజకీయంగా ఎదుర్కోవాలని సూచించారు.


నవంబర్‌ 27న 15 నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధుల జనరల్‌ బాడీ సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తామని తలసాని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశం ఎలా నిర్వహించాలి అనే దానిపై గ్రేటర్ లీడర్లు అందరం చర్చించామని చెప్పారు. ‘‘దేశంలో ఏం జరుగుతుందో అన్ని గమనిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. సాధారణంగా సోదాలు చేస్తే పట్టించుకోము. కానీ మా పార్టీ నేతలు లక్ష్యంగానే దాడులు జరుగుతున్నాయి. నాకు జ్వరం వస్తే కూడా రాజకీయం చేశారు. వీటన్నిటికీ భయపడి ఉంటే హైదరాబాద్‌లో ఎలా ఉంటాం’’ అని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తలసాని అన్నారు.  ప్రజలను చైతన్యం చేసి కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తామని, 15 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.


ఉదయం నుంచి సోదాలు


మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నివాసంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 50 బృందాలు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లల్లో కూడా తనిఖీలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి.


మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి.